Papaya - బొప్పాయితో వారంలో 2కిలోల వెయిట్ లాస్! ఇందులో నిజమెంత? డాక్టర్లు ఏమంటున్నారు?
Will Papaya Reduce Weight : పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మనలో చాలా మందికి తెలుసు. అలాగే వాటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో బొప్పాయి పండు తినటం వల్ల వారంలోనే ఏకంగా 2 కిలోల బరువు తగ్గొచ్చన్న ఓ పోస్టు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఇది కేవలం అపోహ మాత్రమేనా? ఇందులో నిజమెంత? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు ? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Will Papaya Reduce Weight : బరువు తగ్గాలని చాలా మందికి ఉంటుంది. దీనికోసం ఎన్నో రకాల వ్యాయామాలు చేసే వాళ్లు కొందరైతే.. అది తప్పా అన్నీ చేసే వాళ్లు ఇంకొందరు. ప్రత్యేక మందులు వాడటం, కొన్ని రకాల పదార్థాలు తినటం లాంటివి చేస్తుంటారు. అయితే డైట్ మెయింటెన్ చేయడంలో తప్పు లేదు కానీ చెప్పింది విని ఏది పడితే అది తింటే మాత్రం నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్టు తెగ వైలర్ అవుతోంది. బొప్పాయి పండును తినటం వల్ల బరువు తగ్గుతారని. అంతేకాకుండా.. దాన్ని తరచూ మన ఆహారంలో చేర్చుకుంటే వారంలోనే 2 కిలోల వరకు తగ్గొచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఈ వైరల్ వార్తపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
Papaya Nutrition Facts : బరువు తగ్గాలనుకునేవారికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషన్ కోచ్ సువిధి జైన్ తెలిపారు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని ఆమె చెప్పారు. 100 గ్రాముల్లో బొప్పాయి గుజ్జులో 32 కేలరీలు మాత్రమే లభ్యమవుతాయి. అంతేకాకుండా మన శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్ ఏ, సీ, ఈలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయిని మీ డైలీ డైట్లో చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్.
బొప్పాయి తింటే నిజంగానే బరువు తగ్గుతారా?
Health Benefits Of Papaya : ఈ పండు తినటం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా అనే ప్రశ్నకు సువిధి జైన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 'ఒక పండు తినటం ద్వారా బరువు తగ్గుతాం అనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒక క్లిష్టమైన అంశం. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలంటే సరైన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లలోనూ పోషకాలు ఉన్నప్పటికీ.. క్యాలరీల విషయంలో వాటి పరిమాణం చాలా ముఖ్యం' అని ఆమె పేర్కొన్నారు.
"పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వాటిల్లో సహజ చక్కెరలూ ఉంటాయని గమనించాలి. కాబట్టి పండ్లను మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిది. కానీ మన డైట్లో వాటిని తగినంత పరిమాణంలో భాగం చేసుకోవాలి. అయితే బొప్పాయి తినటం వల్ల మాత్రమే బరువు తగ్గుతారనేది ఓ అపోహ మాత్రమే."
- సువిధి జైన్, పోషకాహార నిపుణులు
గమనిక : బరువు తగ్గడం లేదా ఇతర ఏ ఆరోగ్యం విషయంలోనైనా మీకేమైనా సందేహాలుంటే ఇంటర్నెట్, ఇతర మార్గాల ద్వారా అన్వేషించే కన్నా పోషకాహార నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.
0 Comments:
Post a Comment