తొలి జీతం అందకుండానే స్కూల్ టీచర్ రిటైర్మెంట్..! సర్కార్ కొలువు నెలరోజులే ..
అల్లూరి సీతారామరాజు జిల్లా, జులై 31: చాలామందికి ప్రభుత్వ బడిలో ఉద్యోగం సంపాదించాలంటే ఓ చిరకాల స్వప్నమే..! ప్రతిభ ఉన్న కొన్నిసార్లు అదృష్టం ఆటలాడుకుంటుంది.
ఒక్కోసారి అదృష్టం కనికరించినా.. అప్పటికే కాలం మించిపోతుంది. ఎస్.. అటువంటి వ్యక్తుల్లో ఒకరు అల్లూరు ఏజెన్సీలో ఉద్యోగం చేసిన మాస్టారు. ఆయన ఓ ఉపాధ్యాయుడు.. ఏళ్ల తరబడి వేచి చూసిన తర్వాత ఉద్యోగం వరించింది. కానీ తనకు కేవలం నలభై అయిదు రోజుల మాత్రమే ఉద్యోగం చేసే భాగ్యం కలిగింది. ఆ తరువాత పదవీ విరమణ కాలం వచ్చేసింది. విచిత్రమేమిటంటే ప్రభుత్వ జీతం తీసుకోకుండానే ఆ మాస్టారు రిటైర్డ్ అయ్యారు. ఇంతకీ ఎవరా టీచర్..? ఏమిటా కథ..?
– ఇదిగో ఇతని పేరు పద్మాకర్ రావు. ఊరు గుంటూరు జిల్లా నరసరావుపేట. 98 డీఎస్సీ అభ్యర్థి. అప్పటినుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎట్టగలకు ఇటీవల ప్రభుత్వం భర్తీ లు చేయడంతో.. నాన్ లోకల్ క్యాడర్ 104 ర్యాంకులో అల్లూరి ఏజెన్సీలో ఉద్యోగం వచ్చింది. అది కూడా మినిమం టైం స్కేల్ ప్రాతిపదికన. ఉపాధ్యాయ మొదటి కౌన్సిలింగ్లో పాడేరు మండలం గున్న గుమ్మి గ్రామంలోని పాఠశాలలో ఈ ఏడాది ఏప్రిల్ 17న ఉపాధ్యాయుడిగా చేరారు. అదే నెల 30 తారీఖు వరకు విధులు నిర్వహించారు. విద్యా సంవత్సరం ముగియవడంతో.. ఆ ఏడాదికి పదవీకాలం ముగిసినట్టు అయింది.
నెలరోజులే ఉద్యోగం..!
ఈ ఏడాది విద్యా సంవత్సరంలో మరోసారి రెండో విడత కౌన్సిలింగ్ లో జి మాడుగుల మండలం కే కోడాపల్లి మండల ఉన్నత పరిషత్ పాఠశాలలో చేరారు. జూన్ 27న విధుల్లో చేరి.. పాఠాలు బోధించారు. అయితే ఆ అదృష్టం కేవలం నెలరోజులు మాత్రమే వివరించింది. జూలై 27న.. వయసుమెరడంతో పదవీ విరమణ చేశారు పద్మాకర్ రావు. దీంతో మొదటి జీతం తీసుకోకుండానే పద్మాకర్ రావు రిటైర్మెంట్ అయ్యారు.
– పద్మాకర్ రావుకు ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉంది. ఉద్యోగంలో చేరడానికి ముందు గుంటూరు జిల్లా నరసరావుపేటలో 15 ఏళ్లుగా పాఠాలు బోధించారు.వివిధ ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో ఇంగ్లీషు బోధన చేసేవారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గిరిజన ప్రాంతంలో అవకాశం కలగడంతో సంతోషం వ్యక్తం చేశారు పద్మాకర్ రావు. అతి తక్కువ కాలంలోనే గిరిజన బాలబాలికలతో మమేకమై వారిలో కలిసిపోయారు. అయితే ఇప్పుడు ఉద్యోగ విరమణ కావడంతో పిల్లలను విడిచి వెళ్లలేకపోతున్నారు పద్మాకర్ రావు. ‘చేసిన ఉద్యోగం కొద్దిరోజులే అయినా.. గిరిజన ప్రాంతంలో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్న. ఇంకా చేయాలని ఆశ ఉన్న.. ఉద్యోగ విరమణ వయసు పూర్తయింది. జీవితంలో గిరిజన పిల్లలకు చదివించినందుకు సంతృప్తినిచ్చింది. అయితే ప్రభుత్వ జీతం చేతికి అందుతుందని ఓ ఆశ’ అని టీవీ9 తో అన్నారు రిటైర్డ్ ఉపాధ్యాయుడు పద్మాకర్ రావు.
ఇంకొంత కాలం ఉండి ఉంటే..
పదవి విరమణ చేసిన పద్మాకర్ రావుకు సహచర ఉపాధ్యాయులు సన్మానించారు. పద్మాకర్ రావు
సేవలను కొనియాడారు. కనీసం మరో రెండేళ్లు కాలవ్యవధి ఉన్నట్లయితే.. గిరిజన ప్రాంతంలో మంచి విద్య బాల బాలికలకు లభించాలని, పద్మాకర్ రావు బోధనను ఉద్దేశిస్తూ కొనియాడారు ప్రధానోపాధ్యాయుడు మహేష్, సహచర ఉపాధ్యాయుడు గంగాధర్ రావు.
మాస్టారు వెళ్ళిపోతున్నందుకు ఆ చిన్నారులు, గిరిజనుల ఆవేదన
పద్మాకర్ రావు విధులు నిర్వహించిన అనతి కాలంలోనే అతనితో విద్యార్థులకు అనుబంధం ఏర్పడింది. మాస్టారు ఇక పాఠాలు బోధించారన్న సంగతి తెలిసి కళ్ళు చెమర్చారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగం చేసిన జీతం తీసుకోకుండానే రిటైర్మెంట్ అయ్యారు పద్మాకర్ రావు. విధులు నిర్వహించిన కాలానికి ప్రభుత్వం జీతం చెల్లించాలని కోరుతున్నారు సహచరులు ఉపాధ్యాయులు.
ఇదండీ.. ఎంతకాలం పనిచేసామన్నది కాదు.. ఉద్యోగ కాలంలో ఎంతమంది హృదయాలను గెలుచుకున్నామనేది ముఖ్యం. తన జీవిత కోరిక నెరవేరినందుకు పద్మాకర్ రావుకు సంతృప్తినిచ్చింది.
టెక్కలి మండలంలో కూడా ఒక టీచర్ జీతం. తీసుకోకుండానే రిటైర్ అయ్యారు వల్లభ రంగారావు 1998DSC
ReplyDelete