Chandrayaan 3: అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ల్యాండింగ్: కొత్త ముహూర్తం ఇదే..!!
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి.
వాటి పనితీరుపై ఇస్రో సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండూ సజావుగా సాగుతున్నాయని తెలిపింది. ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు ఇప్పటివరకు తల ఎత్తలేదు. దీనికి నిదర్శనమే చంద్రుడి ఉపరితలం ఫొటో. ఈ నెల 15వ తేదీన చంద్రుడి ఉపరితలాన్ని ఫొటో తీసి పంపించింది చంద్రయాన్ 3 ల్యాండర్. అతి సమీపం నుంచి జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్మనిపించింది.
కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 చందమామ వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.
చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకున్నారు.
నిజానికి- ప్రయోగ సమయంలో ప్రకటించిన ల్యాండింగ్ టైమింగ్లో చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3.. జాబిల్లి మీద కాలు మోపుతుందని ఇదివరకు ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇందులో మార్పులు చేసింది ఇస్రో. ల్యాండింగ్ సమయాన్ని కొంత ముందుకు జరిపింది. సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు బదులుగా 6 గంటల 04 నిమిషాలుగా ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రయాన్ 3.. చంద్రుడిపై అడుగు మోపుతుందని తాజాగా వెల్లడించింది. ల్యాండింగ్ కోసం ఇస్రో.. చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది.
0 Comments:
Post a Comment