Kuja Dosham -కుజ దోషము అంటే ఏమిటి? వివాహ పొంతనలో దానికి ప్రాధాన్యత ఎందుకు?
వివాహ సంబంధం చూసేటప్పుడు కుజదోషానికి ప్రాధాన్యత ఇవ్వాలా? జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కుజ గ్రహం క్రూర, ఉగ్ర గ్రహం. ఏ జాతకునికి అయితే జీవితములో కుజగ్రహం శుభస్థానాల్లో ఉంటుందో అటువంటి వారికి జీవితము చాలా ప్రశాంతముగా, ఆనందముగా ఉంటుందని శాస్త్రాలు తెలియచేస్తున్నట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కుజ దోషం అంటే
ఇక కుజదోషమంటే జాతకచక్రములో లగ్నమునుంచి 1, 2, 4, 7, 5, మరియు 12 స్థానములలో గనుక కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకునకు కుజ దోషము ఉన్నట్లుగా జ్యోతిష్యశాస్త్రము ప్రకారం లెక్కిస్తారు. కొన్ని సందర్భాలలో కుజుని యొక్క లగ్నాన్ని బట్టి, కుజుడు ఉన్నటువంటి స్వక్షేత్ర ఉచ్చ క్షేత్రాలను బట్టి ఈ యొక్క స్థానాలలో కుజ దోషము కలుగకపోవచ్చు. కుజ దోషము ఉన్న జాతకులకు వారికి కుజ దోషము ఉన్న స్టానాన్ని బట్టి, వారి యొక్క వయస్సును బట్టి వారికి ఆ దోష ప్రభావాలు విభిన్నంగా ఉండవచ్చు.
కుజ దోషం ఉంటే ఇలా
జాతకములో కుజదోషము ఉన్నటువంటి వారికి చిన్నపిల్లల మనస్తత్వం, ఆగ్రహావేశము, క్రూరముగా వ్యవహరించడం, ఉగ్రముగా ఉండటం వంటి లక్షణాలు అధికముగా ఉంటాయి. కుజ దోషము ఉన్న జాతకులకు వివాహ వయస్సు వచ్చినపుడు
వివాహము ఆలస్యము అవ్వడము, అనేక వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చి ఆఖరి నిముషాలలో చేజారిపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
వివాహం అయ్యాక
కుజ దోషము ఉన్న జాతకులు వివాహం అయిన తరువాత వైవాహిక జీవితములో సమస్యలు అధికముగా ఏర్పడుతాయి. కుజుడు ఏడో స్థానము అయినటువంటి వైవాహిక స్థానములో ఉన్నట్లయితే, ఎనిమిదవ స్థానములో కూడా ఉన్నట్లయితే వారికి వైవాహిక జీవితములో సమస్యలు ఏర్పడుతాయి. విడాకులు, రెండు నుండి మూడు వివాహాలు వంటివి ఏర్పడు పరిస్థితులు అధికముగా ఉండును.
వ్యయస్థానములో ఉన్నటువంటి కుజుని ప్రభావం వలన కుటుంబము నందు అశాంతి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి ఏర్చడును అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ కుజ గ్రహం కనుక శని రవి రాహువు వంటి పాప గ్రహాలతో కలసి ఆ కుజదోషము ఉన్నటువంటి స్థానాలలో ఉన్నట్లయితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చిలకమర్తి తెలిపారు.
కుజ దోష ప్రభావాలు తొలగాలంటే
కుజ దోష ప్రభావాలు తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గము అమ్మ వారిని (దుర్గాదేవి) పూజించడమే. కుజ దోషమున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి. సంవత్సరములో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి వంటి ముఖ్యమైన రోజులు విశేషంగా సుబ్రహ్మణ్యున్ని పూజించాలి. కుజదోషము తీవ్రముగా ఉన్న జాతకులు కుజ గ్రహ శాంతులు, కుజగ్రహ హోమాలు, కుజగ్రహ జపాలు మరియు దానాలు ఆచరించి తీరాలి.
కుజదోషము ఉన్న జాతకులు జీవితములో నిత్యం సుబ్రహ్మణ్యున్ని పూజిస్తూ, సుబ్రహ్మణ్యునికి అభిషేకాలు వంటివి ఆచరించినట్లయితే వారి జాతకములో ఉన్న కుజ దోషము నివృత్తి జరిగేటటువంటి అవకాశముంటుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
0 Comments:
Post a Comment