Chandrayan-3 | చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకంత కష్టం? చంద్రయాన్-2 కూలిపోవడానికి కారణమేంటి?
Chandrayan-3 | చంద్రయాన్-3 ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనివెనక ఎంతో కఠినమైన సాంకేతిక అవసరం.
భారత్ గతంలో పంపిన చంద్రయాన్-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్ సులభం కాదన్నది నిపుణుల మాట.
Chandrayan-3 | న్యూఢిల్లీ, జూలై 14: ఈ మొత్తం చంద్రయాన్-3 ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనివెనక ఎంతో కఠినమైన సాంకేతిక అవసరం. భారత్ గతంలో పంపిన చంద్రయాన్-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్ సులభం కాదన్నది నిపుణుల మాట.
సాఫ్ట్‌ల్యాండింగ్ ఎందుకంత కష్టం?
ల్యాండర్‌ను సరిగ్గా ఎక్కడ ల్యాండ్ చేయాలన్న కచ్చితమైన పిన్‌పాయింట్ నేవిగేషన్ గైడెన్స్‌తోపాటు ఫ్లైడనమిక్స్ కచ్చితంగా ఉండాలి. ల్యాండయ్యే ప్రదేశాలు స్పష్టంగా కనిపించడంతోపాటు కచ్చితమైన టైమింగ్ పాటించాలి. సరైన సమయంలో సరైన వేగంతో ల్యాండింగ్ స్పాట్‌ను చేరుకోవడం వంటి అంశాలు ల్యాండింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా మొత్తం మిషన్ వృథా అవుతుంది.
ల్యాండింగ్ ప్రదేశమూ కీలకమే
ల్యాండర్ దిగే ప్రదేశం కూడా ముఖ్యమే. పెద్దపెద్ద క్రేటర్లు (లోయలు), వదులుగా, కఠినంగా ఉండే ఉపరితలం అతిపెద్ద సవాలుగా మారుతాయి. చంద్రయాన్-3లో రెండు ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్, అవాయిడెన్స్ కెమెరాలు ఉపయోగించారు. అవి పంపే ఫొటోలను బట్టి దానిని ఎక్కడ ల్యాండ్ చేయాలన్న తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎక్కడ ల్యాండ్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని దానికి పంపినా అవి అందడం లేటైతే మాత్రం తనంత తానే నిర్ణయం తీసుకుంటుంది. జాబిల్లి చూడడానికి అందంగా కనిపించినా దానిని చేరుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
15 నిమిషాల టెర్రర్
చంద్రుడిపై ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైనది ఉపరితలంపై సురక్షితంగా దిగటమే. ఇప్పటివరకు చంద్రుడిపై అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్, చైనా మాత్రమే తమ ల్యాండర్లను సురక్షితంగా దింపగలిగాయి. చంద్రయాన్-2 ద్వారా భారత్ ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో విఫలమైంది. ఈ ప్రక్రియను '15 నిమిషాల టెర్రర్’ అని ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ అభివర్ణించారంటే అది ఎంతటి కష్టసాధ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. భూమిపైలాగా చంద్రుడిపై వాతావరణం ఉండదు. చందమామపై ల్యాండర్‌ను దింపేటప్పుడు గురుత్వాకర్షణకు లోనై అది కూలిపోకుండా ఉండేందుకు వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ ఉండాలి. అందుకోసం అందులో ఉంచిన రాకెట్లను మండిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ముందుగా నిర్ణయించినట్టుగానే సాగాలి. కానీ, ఇందులో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పటివరకు 37 శాతం ప్రయోగాలే విజయవంతమయ్యాయి.
వేగమే కీలకం
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని, పక్కలకు స్వింగ్ అయ్యే వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుందని చంద్రయాన్-2లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ వేగాన్ని సెకనకు మూడు మీటర్లకు తగ్గించాలి. వేగ నియంత్రణ కోసం ఆ సమయంలో థ్రస్టర్ల (ఇంజిన్లు)ను మండిస్తారు. ఈ ఏడాది జపాన్ పంపిన హకుటో-ఆర్ ల్యాండర్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని విఫలమైంది. భారత్ పంపిన చంద్రయాన్-2 కూడా సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా ల్యాండింగ్‌లో ఇటువంటి సమస్యనే ఎదుర్కొని కుప్పకూలింది.
వాతావరణం ఉండదు
చంద్రుడిపై వాతావరణం లేకున్నప్పటికీ భూమితో పోలిస్తే ఆరోవంతు గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. కాబట్టి చంద్రయాన్ వంటి మిషన్లు విజయవంతం చేయాలంటే దీనిని కూడా సరిగ్గా అర్థం చేసుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్ అవరోహణపై మరింత కచ్చితత్వం అవసరం. ఇది ల్యాండర్ థ్రస్టర్లపై భారం పెంచుతుంది. సరైన శక్తితో సరైన సమయంలో సరైన స్థాయిలో ఇంజిన్లు మండాల్సి ఉంటుంది. ల్యాండర్ కిందికి జారుతున్న వేగాన్ని నియంత్రించడంలో ఏ చిన్న తేడా జరిగినా ల్యాండర్ కూలిపోవడం ఖాయం.
వచ్చే నెల 23న ల్యాండింగ్
అత్యంత కీలకమైన ల్యాండింగ్ ప్రక్రియను వచ్చే నెల 23న చేపట్టనున్నట్టు ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని ప్రకటించారు. ప్రస్తుతానికి అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ వీరముత్తువేల్ తెలిపారు.
0 Comments:
Post a Comment