ఏపీకి మరో తీపి కబురు చెప్పిన కేంద్రం...
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తానంగా వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లల్లో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది.
ఆయా రాష్ట్రాలను అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
మహారాష్ట్రలో ముంబై వర్షాల ధాటికి అల్లకల్లోలంగా మారింది. పొరుగునే ఉన్న థానె సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ముంబై, థానె, రత్నగిరి, పాల్ఘర్, రాయగఢ్..వంటి జిల్లాల్లో ఇప్పటికే అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.
వర్షాల నేపథ్యంలో- ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కింద తక్షణ చర్యలను తీసుకుంటోన్నాయి. లోతట్టు ప్రాంతాలవాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, వారికోసం సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల కోసం భారీగా నిధులను వ్యయం చేస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీపి కబురు ఇచ్చింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తక్షణ చర్యలను చేపట్టడానికి అవసరమైన నిధులను మంజూరు చేసింది.
వర్షాకాలంలో చేపట్టాల్సిన విపత్తు నిర్వహణ చర్యల కోసం 19 రాష్ట్రాలకు 6,194.40 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇందులో 4,984.50 కోట్ల రూపాయలను 15 రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, త్రిపుర ఉన్నాయి.
2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కోసం ఖర్చే చేయాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, ఉత్తర ప్రదేశ్‌లకు 1,209.60 కోట్ల రూపాయల చొప్పున విడుదల అయ్యాయి. ఈ మొత్తం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది.
0 Comments:
Post a Comment