బంగాళాఖాతంలో వాయుగుండం.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలెర్ట్..
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ విభాగం తెలిపింది. ఇది మరింత తీవ్రమై.. వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.
దాని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ( జులై 25 నుంచి) ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..విశాఖ నగరంలో, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉన్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి బుధవారం ( జులై 26) నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. దీంతో పలు జిల్లాల్లో జులై 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు
ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వాయుగుండం ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం ( జులై 25) నుంచి రాష్ట్రంలో మూడు రోజులు విస్తారంగా వానలు పడనున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు.
సోమవరం ( జులై 24) రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం పొలవరం దగ్గర నీటిమట్టం 11.8 మీటర్లు ఉండగా.. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
0 Comments:
Post a Comment