విద్యార్థులకు విద్యాధన్ వరం.
జూన్ 20 దరఖాస్తులకు తుది గడువు
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు
పదోతరగతి పూర్తి చేసిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సరోజినీ నాయుడు ఫౌండేషన్ విద్యాధన్ ఉపకార వేతనం మంజూరు చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న విద్యార్థులకు ఈ పథకం వరంగా నిలవనుంది. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియట్‌తో పాటు పదోతరగతి అర్హతతో ఇతర డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నారు. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు ఈ-మెయిల్ ద్వారా జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పదో తరగతిలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఆన్‌లైన్‌లో అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ (మౌఖిక) పరీక్ష నిర్వహించి ప్రతిభను కనబరచిన వారిని ఉపకార వేతనాల కోసం ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు విధానం.. : అర్హులైన విద్యార్థులు దరఖాస్తులో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పదోతరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు వైకల్యానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశంపొందిన కళాశాల అడ్మిషన్ పత్రం జత చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు వారి ఈ మెయిల్ ఐడీని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి.
జులై 9న అర్హన పరీక్ష : ఉపకార వేతనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతిలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో జులై 9న అర్హత పరీక్ష, 26-31 వరకు మౌఖిక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రాసేందుకు ఎంపికైన అభ్యర్థులకు జులై 1న హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. రాత, మౌఖిక పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఉపకార వేతనాల కోసం ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల చరవాణికి సంక్షిప్త సందేశం లేదా ఈ-మెయిల్ ఐడీకి వివరాలను పంపిస్తారు. ఇంటర్మీడియట్‌తో పాటు ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఉపకార వేతనాలు అందజేస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో ఏడాదికి రూ. 10 వేల వంతున రెండేళ్లకు రూ. 20 వేల వంతున ఆర్థిక సాయం అందజేస్తారు. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం ప్రతిభ ఆధారంగా ఏడాదికి రూ. 60 వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
అర్హులు ఎవరంటే.. : విద్యాధన్ ఉపకార వేతనాల కోసం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి పదో తరగతిలో కనీసం 9 జీపీఏతో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు 7.5 జీపీఏ సాధించినట్లయితే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2 లక్షల మించరాదు.
0 Comments:
Post a Comment