Sprouted Coconut | కొబ్బరికాయలో పువ్వు వచ్చిందా? అయితే ఈ ప్రయోజనాలు తెలుసుకోండి!
Sprouted Coconut: మీరు ఎప్పుడైనా కొబ్బరికాయను పగులగొట్టినపుడు ఒక్కోసారి అందులో పువ్వు ఆకృతిలో తెల్లని, మెత్తటి పదార్థాన్ని గమనించవచ్చు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
చాలా మంది ఇలా రావడం శుభప్రదం అని నమ్ముతారు. అయితే ఇలా వచ్చిన కొబ్బరికాయను ఏం చేయాలి, తినాలా వద్దా అనే సందేహాన్ని మీలో చాలా మంది కలిగి ఉండొచ్చు. కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దానిని వదలకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కొబ్బరిపువ్వులో పోషకాలు దట్టంగా ఉంటాయి, దానిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
కొబ్బరిపువ్వు నిజానికి ఏమిటి?
కొబ్బరిపువ్వును దానికి వచ్చిన మొలకగా చెప్పవచ్చు. ఏదైనా కొబ్బరికాయ చాలా ఎక్కువగా పరిపక్వం చెందినపుడు అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది, ఇది మొలకెత్తిన కొబ్బరికాయగా అభివృద్ధి చెందుతుంది. పెంకు లోపల ఉన్న విత్తనం మొలకెత్తిన తర్వాత, అది కొబ్బరి నీటిని గ్రహించి, ఘనమైన స్పాంజ్ లాంటి ద్రవ్యరాశిగా పెరుగుతుంది. దీనిని కొబ్బరిపువ్వు,కొబ్బరి పిండం, కొబ్బరి యాపిల్ అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు. ఒకవేళ మీ కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు.
కొబ్బరిపువ్వులో ఎలాంటి పోషకాలు ఉంటాయి, కొబ్బరిపువ్వును ఎలా తినాలి, కొబ్బరిపువ్వు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Sprouted Coconut health benefits) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కొబ్బరిపువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీపెరాసిటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. తద్వారా ఇది మీ శరీరంలో అనేక రకాల ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌లు, వ్యాధులకు వ్యతిరేకంగా రోగ నిరోధకతను పెంపొందించడంలో సహాయపడుతుంది. మీరు రోగాలబారిన పడకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
సమృద్ధిగా పోషకాలు
కొబ్బరి యాపిల్ అనేక పోషకాలకు గొప్ప మూలం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొలకెత్తిన కొబ్బరికాయలను తినడం వల్ల శరీరానికి పోషణ అంది నిండైన ఆరోగ్యం లభిస్తుంది.
బరువు నియంత్రణ
కొబ్బరిపువ్వులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి దీనిని తిన్నప్పుడు మీకు కడుపునిండిన అనుభూతి కలుగుతుంది. మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది, అదనపు కొవ్వు కరిగి మీరు సరైన శరీర ఆకృతిని పొందడంలో సహాయపడుతుంది
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
మధుమేహం ఉన్నవారు కొబ్బరిపువ్వును ఆనందంగా తినవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా చక్కెర వ్యాధి ప్రమాదకరమైన దుష్ప్రభావాలను తగ్గించవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
కొబ్బరిపువ్వు జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనిని తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యం బాగుంటుంది. మలబద్ధకం నివారించడంతో పాటు ఎసిడిటీ, పొట్టలో పుండ్లు వంటి జీర్ణవ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు అందించడం ద్వారా జీర్ణక్రియ, జీవక్రియకు సహాయపడుతుంది.
క్యాన్సర్ నుండి రక్షణ
కొబ్బరిపువ్వులోని పోషకాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి, కాబట్టి కొబ్బరి యాపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నమ్ముతారు.
వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది
కొబ్బరిపువ్వును తినడం వల్ల మీరు అందమైన జుట్టు, ఆరోగ్యమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మంపై చారలు, ముడతలు, మచ్చలు మొదలైన వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.
ఎనర్జీ బూస్టర్
కొబ్బరి యాపిల్‌లో ఉండే సహజ చక్కెరలు మీకు తక్షణ శక్తిని అందించగలవు. అలసట, నీరసం వంటి లక్షణాలను ఎదుర్కోవడానికి ఇది ఆదర్శవంతమైన అల్పాహారం. అంతేకాకుండా మొలకెత్తిన కొబ్బరికాయలలో కనిపించే జిలాటినస్ పదార్ధం మిమ్మల్ని హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపుతుంది, శరీరంలో అధిక వేడిని సమతుల్యం చేసి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది.
కొబ్బరిపువ్వును నేరుగా తినవచ్చు. దీనిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయవచ్చు, ఫ్రూట్ సలాడ్‌లలోకి కలుపుకోవచ్చు. అయితే ఉడికించడం, కాల్చడం చేస్తే అది దీని మెత్తటి ఆకృతిని నాశనం చేస్తుంది. రుచితో పాటు, పోషకాలను కోల్పోతుంది. కాబట్టి కొబ్బరిపువ్వును దాని సహజమైన రూపంలోనే ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి.
0 Comments:
Post a Comment