పుతిన్‌ను బెంబేలెత్తిస్తోన్న గుండు బాస్ ఎవరు?- రష్యా అంతర్యుద్ధానికి కారణాలేంటీ?
మాస్కో: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అంతర్యుద్ధం మొదలైందక్కడ. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కుడిభుజంలా ఉంటూ వచ్చిన వాగ్నర్ మెర్సినరి గ్రూప్ ప్రైవేట్ ఆర్మీ..
తిరుగుబాటును లేవనెత్తింది. రష్యా సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడమే దీనికి కారణమైంది. ఈ ఘటన తరువాత వాగ్నర్ గ్రూప్ అడ్డం తిరిగింది. అంతర్యుద్ధాన్ని మొదలుపెట్టింది.
ఈ అంతర్యుద్ధం తరువాత ఒక్కసారిగా వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ ప్రిగోజిన్ వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతుడైన దేశాధినేతల్లో ఒకడైన వ్లాదిమిర్ పుతిన్‌ను సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ?, ఎవరీ ప్రిగోజిన్.. అనేది చర్చనీయాంశమైంది. అత్యంత పకడ్బందీగా రష్యాలో అంతర్యుద్ధానికి కారకుడైన ప్రిగోజిన్ నేపథ్యం- అంతే ఆసక్తి కలిగించేదే.
ప్రిగోజిన్ పూర్తి పేరు యెవ్‌జెని ప్రిగోజివ్. గుండు తలతో కనిపిస్తుంటాడు. వయస్సు 62 సంవత్సరాలు. తనకంటూ ఓ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో పని చేస్తోన్న వారిలో మెజారిటీ సంఖ్యలో ఖైదీలే ఉన్నారు. అందుకే దీనికి మెర్సినరీ గ్రూప్‌గా పిలుస్తుంటారు. గతంలో పుతిన్‌కు అత్యంత ఆప్తుడు కూడా. ఒకరకంగా కుడి భుజంగా పేరు తెచ్చుకున్నాడు. ముద్దుగా ఆయనను పుతిన్ షెఫ్‌గా పిలుస్తారు. సుమారు రెండు దశాబ్దాల పాటు రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్‌కు క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను కుదుర్చుకోవడమే దీనికి కారణం.
1980లో జైలు శిక్షను అనుభవించాడు ప్రిగోజిన్విడుదలైన తరువాత తన స్వగ్రామంలో హాట్‌డాగ్‌లను విక్రయించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత సూపర్ మార్కెట్ల వ్యాపారంలో అడుగు పెట్టాడు. కొంతకాలం తరువాత సొంతంగా రెస్టారెంట్, క్యాటరింగ్ కంపెనీని ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్లు అప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్ డిప్యూటీ మేయర్ వ్లాదిమిర్ పుతిన్‌ను బాగా నచ్చాయి. దీనితో- తన షెఫ్‌గా అపాయింట్ చేసుకున్నాడు.
అక్కడి నుంచి ప్రిగోజిన్‌కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతని క్యాటరింగ్ సంస్థ ద్వారా ప్రభుత్వ సంస్థలకు ఆహారం, భోజనాలను సరఫరా చేసే ఒప్పందాలను కుదుర్చుకుంది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం ప్రిగోజిన్ జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రైవేట్ మిలిటరీ గ్రూప్‌ను స్థాపించడానికి దారి తీసింది. వాగ్నర్ గ్రూప్‌ను నెలకొల్పారు. లిబియా, సిరియా, సెంట్రల్ ఆఫ్రికన్, మాలి వంటి దేశాలకు సేవలందించింది.
0 Comments:
Post a Comment