New Parliament Building: నూతన పార్లమెంట్‌లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
నూతన పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మే 28న ప్రారంభించారు. జాతీయత ఉట్టిపడేలా దేశంలోని వివిధ కళాకృతులను పార్లమెంట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు.
అయితే, కొత్త పార్లమెంట్ భవనం గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఒక వస్తువు చూపరులను ఆకట్టుకుంటోంది. ఫౌకాల్ట్ పెండ్యులమ్ (Foucault's Pendulum)గా పిలిచే ఈ వస్తువును నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) నూతన పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసింది. ఇంతకీ ఏంటీ ఫౌకాల్ట్ పెండ్యులమ్? ఎందుకు దీన్ని ప్రత్యేకంగా పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేశారో తెలుసా?
ఫౌకాల్ట్ పెండ్యులమ్ భూ భ్రమణాన్ని సూచిస్తుంది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త లియోన్ ఫౌకాల్ట్ పేరు మీదుగా 19వ శతాబ్దంలో దీనికి ఈ పేరు పెట్టారు. లియోన్ ఈ ప్రయోగాన్ని 1851లో నిర్వహించారు. భూ భ్రమణం ఎలా ఉంటుందని చెప్పేందుకు దీన్ని తొలి ఆధారంగా పేర్కొంటారు. ఈ పెండ్యులమ్ గంటకు 1,670 కి.మీ. వేగంతో భ్రమణం చేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నూతన పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన ఫౌకాల్ట్ పెండ్యులమ్‌ను 22 మీటర్ల ఎత్తు, 36 కిలోల బరువుతో రూపొందించారు. దేశంలోనే అతిపెద్ద పెండ్యులమ్ ఇదేనని ఎస్‌సీఎస్‌ఎమ్ చెబుతోంది. ఇది తన పూర్తి భ్రమణాన్ని పూర్తి చేసేందుకు 49 గంటల 59 నిమిషాల 18 సెకన్ల సమయం పడుతుందని తెలిపింది. దీన్ని తయారు చేసేందుకు 10 నుంచి 12 నెలల సమయం పట్టినట్లు ఎన్‌సీఎస్‌ఎమ్ పేర్కొంది. ఇది భూ భ్రమణంతోపాటు భారతదేశానికి, విశ్వానికి సూచికగా ఉంటుందని తెలిపింది.
ఇందులో వృత్తాకార గోళాన్ని పైనుంచి వేలాడదీస్తారు. కింద వలయాకారపు డిజైన్ ఉంటుంది. అందులో వృత్తాకార గోళం పరిభ్రమించే విధానాన్ని భూ భ్రమణానికి రుజువుగా శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ భ్రమణం పెండ్యులమ్ పొడవు, లాటిట్యూడ్‌పై ఆధారపడి ఉంటుంది. దేశంలో తొలిసారి ఇలాంటి పెండ్యులమ్‌ను పుణె విశ్వవిద్యాలయంలోని ఆస్ట్రోఫిజిక్స్ విభాగంలో 1991లో ఏర్పాటు చేశారు. దీనితోపాటు మరో పెడ్యులమ్‌ను ఎన్‌సీఎస్‌ఎమ్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న క్వీన్స్‌లాండ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పెండ్యులమ్ ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో ఉంది. దీని ఎత్తు 67 మీటర్లు.
0 Comments:
Post a Comment