mpup schools - ఏపీలో ఆ ప్రాధమికోన్నత పాఠశాలల విలీనం ? వేరే స్కూళ్లకు మార్చుకోవాలని పేరెంట్స్ కు సూచన..
ఏపీ విద్యారంగంలో భారీ ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ క్రమంలో తక్కువ విద్యార్ధులున్న ప్రాధమికోన్నత పాఠశాలల్ని ఎక్కువ మంది ఉన్న స్కూళ్లలో విలీనం చేయాలని భావిస్తోంది.
దీనిపై నిన్న విద్యామంత్రి బొత్స సత్యనారాయణ కీలక సంకేతం ఇచ్చారు. అలాగే తల్లితండ్రుల్ని ఆయా స్కూళ్లలో చదువుతున్న తమ పిల్లల్ని వేరే స్కూళ్లలో చేర్పించుకోవాలని అభ్యర్ధించారు.
ఏపీలో కనీసం 98 మంది విద్యార్ధులు కూడా లేని ప్రాధమికోన్నత పాఠశాలల్ని ఎక్కువ మంది విద్యార్ధున్న ఇతర స్కూళ్లలో విలీనం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ప్రధాన కారణం అక్కడ సబ్జెక్ట్ టీచర్లను నియమించే పరిస్దితి లేకపోవడమే. కనీసం 98 మంది పిల్లలు కూడా లేని ప్రాధమికోన్నత పాఠశాలల్లో ఐదుగురు సబ్జెక్ట్ టీచర్ల చొప్పున నియమించడం కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ఆయా స్కూళ్లను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లితండ్రులకు కీలక సూచన చేశారు.
ఆయా ప్రీ హైస్కూళ్లలో చదువుతున్న తమ విద్యార్ధుల్ని సమీపంలోని ఇతర స్కూళ్లు.. అంటే కేజీబీవీలు, ఎస్సీ, బీసీ విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్చుకోవాలని బొత్స తల్లితండ్రులకు సూచించారు. వాస్తవానికి ప్రభుత్వం స్కూళ్ల హేతుబద్ధీకరణలో భాగంగా జీవో నంబర్ 117 తీసుకొచ్చింది. దీని ప్రకారం 98 మంది కన్నా తక్కువ విద్యార్ధులున్న ప్రీ హైస్కూళ్లలో 3 నుంచి 8వ తరగతి వరకూ సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వడం లేదు. వారి స్ధానంలో ఎస్జీటీలే చదువు చెబుతారు. దీంతో విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా స్కూళ్లు మార్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
అయితే విద్యార్ధుల తల్లితండ్రులకు తాను చేసిన సూచన ఆదేశం మాత్రం కాదని, కేవలం అభ్యర్ధనే అని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం విలీనం పేరుతో విద్యార్ధుల్ని వేరే స్కూళ్లకు తమ పిల్లల్ని మార్చుకోవాలని ఆదేశాలు ఇవ్వడం కుదరదు. దీన్ని మళ్లీ వివాదాస్పదం చేయకుండా ఉండేందుకు బొత్స ఈ క్లారిటీ ఇచ్చారు.
0 Comments:
Post a Comment