Monsoon: ఏపీకి చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇక వర్షాలే..
Southwest Monsoon Rains : సూర్యుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలకు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.
నిప్పుల కుంపటిలా ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో ప్రజానీకం నానాఅవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో మూడు రోజుల్లో ఏపీకి వర్షసూచన చెప్పింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ మధ్య రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 19 నుంచి చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక కోస్తాంధ్రలో కూడా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలకు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30-40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
మూడు వారాలుగా మాడు పగిలే ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఉష్ణోగ్రతలు తగ్గలేదు. రోజు రోజుకు వడగాలులు పెరిగిపోతున్నాయి. వర్షం జాడలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సాధారణం కంటే 6-10 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత మూడు వారాలుగా తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. శుక్రవారం వడగాలులు తీవ్రత మరింత పెరిగి ఏకంగా 47 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8 డిగ్రీలు, తునిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు గోదావరి, ప్రకాశం, విజయనగరం, తిరుపతి, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పల్నాడు, విశాఖపట్నం, ఇతర జిల్లాల్లో 45-46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాయలసీమలో తటస్థంగా రుతుపవనాలు
రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లోని 264 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు, ఆదివారం 42 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 203 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి వాయవ్య గాలులు కారణమని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్ నుంచి వేడితో కూడిన పొడిగాలులు ఏపీ వైపు వీస్తున్నాయని, అవి దిశ మార్చుకుని నైరుతి లేదా దక్షిణ గాలులు వీచే వరకు ఉక్కపోత పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల రాయలసీమలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు పుట్టపర్తి, శ్రీహరికోటల ప్రాంతంలో తటస్థంగా ఉండిపోయాయని తెలిపారు. రుతుపవనాల విస్తరణ లేకపోవడంతో రాష్ట్రంలో వర్షాలు కురవడంలేదని వాతావరణ నిపుణులు అంటున్నారు.
0 Comments:
Post a Comment