Kids Financial Lessons: పిల్లలకు తప్పక నేర్పాల్సిన ఆర్థిక పాఠాలు.. పొదుపు గురించి ఇలా చెప్పండి..
ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవితం సాగించాలంటే దాని గురించి చిన్నతనం నుంచే అవగాహన పెంచుకోవాలి. మన విద్యావ్యవస్థలలో ఆర్థిక అక్షరాస్యతలేమి కారణంగా పిల్లలకు డబ్బు విలువ గురించి పెద్దగా తెలియడం లేదు.
వారు అనవసరమైనవన్నీ కొనేస్తూ, పొదుపు చేయడానికి ఆసక్తే చూపడం లేదు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు విలువ గురించి పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చెప్పాలి. బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో కూడా నేర్పించాలి. చిన్నతనం నుంచే పొదుపు చేసే అలవాటును వారిలో పెంపొందించాలి. అత్యంత అవసరమైన వస్తువులు మాత్రమే కొనేలా వారిని మార్చాలి. షాపింగ్ చేసేటప్పుడు వస్తువుల ధరలను పోల్చేలా ప్రోత్సహించాలి. ఇంకా వారికి ఏయే ఆర్థిక పాఠాలు నేర్పించాలో తెలుసుకుందాం.
* సహనం ముఖ్యం
ఆర్థికంగా బాగుండాలంటే పిల్లలకు సహనం ఎంతో అవసరం. మనీ మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే ఆర్థిక విషయాలలో ఓర్పు, సహనం అనే ఆయుధాలను వారికి సమకూర్చాలి. కావాల్సిన వస్తువును వెంటనే కొనుగోలు చేయకుండా, కొంతకాలం వేచి ఉండేలా వారిని ప్రోత్సహించాలి. దీనివల్ల వారికి
తాత్కాలిక సంతోషం కోసం వెంటనే డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదనే విషయం తెలుస్తుంది. సహనం వల్ల పిల్లలు తమ చర్యలపై స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. కొంతకాలం వెయిట్ చేసి మరిన్ని, దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.
* మనీ మేనేజ్‌మెంట్ స్కిల్స్
పిల్లలకు ప్రతి నెలా వారి పాకెట్ మనీగా నిర్ణీత మొత్తాన్ని ఇవ్వాలి. తర్వాత ఆ నెల మొత్తం ఆ పాకెట్ మనీతోనే సరిపెట్టుకోమని, అదనంగా రూపాయి కూడా ఇవ్వమని వారికి తెలియజేయాలి. వారికి ఇచ్చిన పాకెట్ మనీలోనే వారి ఖర్చులను మేనేజ్ చేసేలా నేర్పించాలి. ఖర్చులను ట్రాక్ చేయమని వారిని ప్రోత్సహించాలి. అవసరాలు, కోరికలకు తేడాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. పొదుపు లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం వారి పాకెట్ మనీలో కొంత డబ్బును దాచుకోమని చెప్పాలి.
* ఖర్చుల పట్ల జాగ్రత్తలు
డబ్బు అనేది జీవితాన్ని సులభతరం చేయడంలో, లక్ష్యాలను సాధించడంలో గొప్పగా తోడ్పడే ఒక సాధనమని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. డబ్బు తమకు మాత్రమే కాకుండా వారి ప్రియమైన వారికి కూడా సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని వివరించాలి. డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం చాలా ముఖ్యమని అర్థం చేసుకునేలా వారికి వివరించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే డబ్బులు ఖర్చు చేసేలా వారి మైండ్‌సెట్‌ను మార్చాలి. కలలను సాకారం చేసుకోవడంలో ఆర్థిక స్థిరత్వం ఎంత కీలకమో పదేపదే చెప్తుండాలి.
* అప్పు ముప్పు
అప్పుగా తీసుకున్న డబ్బును నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించే అలవాటును పిల్లలలో పెంపొందించాలి. అలాగే వడ్డీ రూపంలో డబ్బులు ఎలా సంపాదించాలో వారికి ప్రాక్టికల్‌గా తెలియజేయాలి.
* దురాశ ప్రమాదం
దురాశతో పిల్లలు చట్టవిరుద్ధమైన పనుల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించే అవకాశముంది. అందువల్ల డబ్బుపై వారికి అత్యాశ కలగకుండా జాగ్రత్త పడాలి. మంచి మార్గంలో సంపాదించినంత చాలు అని సంతృప్తి పడేలా వారిలో మార్పు తేవాలి.
0 Comments:
Post a Comment