విచిత్ర బోధన
విద్యాశాఖలో వింత పోకడ
పాఠశాల విద్యాశాఖ తీరుతో విద్యార్థులకు తీరని నష్టం జరగనుంది..
తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 117 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది విద్యార్థులకన్నా తక్కువగా ఉన్నచోట అక్కడ బోధనలో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.. ఇక్కడ పనిచేస్తున్న పాఠశాల సహాయకులందరినీ హేతుబద్ధీకరణ పేరుతో బదిలీ చేసి వారి స్థానంలో ఒకరిద్దరు సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించింది.
అన్ని సబ్జెక్టులకూ వారే..
అక్కడ ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు ఎస్జీటీలే బోధించాలి. దీంతో ప్రాథమిక విద్యకు నష్టం వాటిల్లే ప్రమాదమే కాకుండా ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు సబ్జెక్టులైన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, జీవ, భౌతికశాస్త్రాలు, సోషల్ సబ్జెక్టులో బోధనా పరిస్థితి వర్ణనాతీతం. ఇందుకు కారణం సబ్జెక్టుపై కనీస పరిజ్ఞానం లేనివారు ఆ సబ్జెక్టులను ఏవిధంగా బోధిస్తారో ప్రభుత్వానికే తెలియాలి. ఉన్నత పాఠశాలల్లో విలీనమైన మూడు,నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు తరగతుల వారీగా సబ్జెక్టు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అక్కడ ఒక విధంగా.. ఇక్కడ మరో విధంగా బోధన జరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రాథమికోన్నత పాఠశాలలు కనుమరగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
98మంది కన్నా తక్కువ పాఠశాలలు 300
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 98మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 300 ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న పాఠశాల సహాయకులందరినీ హేతుబద్ధీకరణ పేరుతో ఉన్నత పాఠశాలలకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ సబ్జెక్టు టీచర్ల బోధనకు విరామం ఇచ్చారు. వీరి స్థానంలో కొందరు ఎస్జీటీలను బోధించాలని చెప్పడం ఎంతవరకు సమజంసమనే ప్రశ్న తలెత్తుతోంది.
ఉన్నతంలోనూ కోతే..
ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో మూడు నుంచి పదో తరగతి వరకు ఉన్న 138మంది విద్యార్థుల కన్నా తక్కువగల పాఠశాలల్లో, ఆరు నుంచి పదో తరగతి వరకు 93మంది కన్నా తక్కువ ఉన్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులను హేతుబద్ధీకరణ పేరుతో తొలగించడంతో పర్యవేక్షణ ప్రశ్నార్థకమైంది. వీటిని అక్కడి ఎంఈవోల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. మూడు నుంచి పదో తరగతి వరకు 138మంది పిల్లల కంటే తక్కువ ఉన్న ఉన్నత పాఠశాలల సంఖ్య 60. ఆరు నుంచి పదో తరగతి వరకు 93మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు 45. ఇదేరీతిన ఇవి కొనసాగితే భవిష్యత్తులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కనుమరగయ్యే పరిస్థితులు రానున్నాయి.
0 Comments:
Post a Comment