*టీచర్ల బదిలీల్లో కీలక ఘట్టం✍️📚*
*♦️ఆప్షన్ల నమోదుకు శ్రీకారం*
*♦️చిన్న పొరపాటు చేసినా ఎనిమిదేళ్లు బాధపడాల్సిందే*
*🌻ఒంగోలు(విద్య), జూన్ 5 :* ఉపాధ్యాయ బదిలీల్లో కీలకమైన ఆప్షన్ల నమోదు ఘట్టానికి తెరలేచింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీలకు సంబంధించి ఖాళీలను ఇప్పటికే ప్రకటించారు. మొత్తం ప్రక్రియలో ఆప్షన్ల నమోదు కీలకం కావడంతో ఏమాత్రం అలసత్వం వహించినా ఇబ్బందే. చిన్న పొరపాటు చేసినా హెచ్‌ఎంలు అయితే ఐదేళ్లు, ఇతర టీచర్లు అయితే ఎనిమిదేళ్లు బాధపడాల్సిందే. బదిలీల కోసం దరఖాస్తు చేసిన గ్రేడ్-2 హెచ్‌ఎంలు సోమ, మంగళవారాల్లో, స్కూలు అసిస్టెంట్లు ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు, సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు ఆప్షన్లు నమోదుకు అవకాశం ఇచ్చారు.
*♦️అప్రమత్తంగా ఉండకపోతే చుక్కలే*
టీచర్లు ఆప్షన్ల నమోదులో చిన్న పొరపాటు చేసినా చుక్కలు చూడాల్సి ఉంటుంది. బదిలీల సీనియారిటీ జాబితాల్లో తమ స్థానానికి అనుగుణంగా కొత్త స్థానాల కోసం ఆప్షన్లు ఇవ్వాలి. బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం ప్రారంభమైన మొదట్లో కందుకూరు ప్రాంతంలో పనిచేస్తున్న అవివాహిత మహిళా టీచర్లు ప్రాధాన్యత కేటగిరీ ఉన్నప్ప టికి పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండ లాలకు బదిలీ అయ్యారు. పరిమితంగా ఆప్షన్లు పెట్టుకోవడంతో వారికి ఈ పరిస్థితి వచ్చింది. బదిలీ కోసం ఎన్ని ఆప్షన్లు అయినా ఇచ్చుకునేందుకు అవకాశం ఉంది. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు ఎన్ని అయినా ఆప్షన్లు ఇవ్వవచ్చు. అభ్యర్థన బదిలీల కోసం దరఖాస్తు చేసిన వారు తమకు ఇష్టమైన స్థానాలకు ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత చివరగా ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాన్ని కూడా ఆప్షన్ నమోదు చేయాలి. ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. ఏదైనా నెట్ సెంటర్ నుంచైనా లేదా టీచర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అయినా ఆప్షన్లు నమోదు చేయవచ్చు.
*♦️స్పౌజ్‌లూ జాగ్రత్త*
బదిలీల ఆప్షన్ల నమోదులో స్పౌజ్ పాయింట్లు వినియోగించుకునే వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అదనపు పాయింట్లు ఉన్నాయి కదా అని ఇష్టారాజ్యంగా ఆప్షన్లు ఇస్తే మొదటికే మోసం వస్తుంది. తప్పనిసరిగా తన స్పౌజ్ స్థానానికి దగ్గరగా ఉండే స్థానాలకు మొదట ప్రాధాన్యమిచ్చేలా ఆప్షన్లు నమోదు చేయాలి. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో స్పౌజ్ పనిచేస్తుంటే పట్టణ ప్రాంతాలకు ఆప్షన్లు ఇస్తే ఇబ్బందులు తప్పవు. స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుంటున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంది. వీరి ఆప్షన్లను పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో పరిశీలించిన తర్వాతే స్థానాలు కేటాయిస్తారు. స్పౌజ్ పాయింట్లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించినట్లు పరిశీలనలో తేలితే వాటిని రద్దు చేస్తారు. మూడు ఇంక్రిమెంట్లు శాశ్వత కోతతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు.
0 Comments:
Post a Comment