ఏపీ ప్రజలకు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక?
ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర ఒడిసా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది.
రానున్న రోజుల్లో ఇది ఉత్తర మధ్యప్రదేశ్ వైపు పయనించనుంది. ఏపీ, యానాంలో పడమటి గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి.
అల్పపీడనం, ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఉభయగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అక్కడక్కడా బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో కొన్ని జిల్లాల్లో వాతవరణం మారిపోయింది. కొన్ని చోట్ల చిరు జల్లులు పలకరించాయి.
తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో సోమవారం వరకు అత్యధికంగా కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో 7 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ 6 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ముథోల్‌లో 5 సెంటీమీటర్లు, కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లో 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
0 Comments:
Post a Comment