జగన్ సర్కార్ కు కేంద్రం మరో గుడ్ న్యూస్..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రం జగన్ తో ఎన్డీయే సర్కార్ కలిసి పనిచేస్తోంది.
దీంతో నిధుల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తోంది. విభజన హామీలు అమలు చేయకపోయినా ఎప్పటికప్పుడు నిధులిస్తూ ఊరటనిస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో విషయంలోనూ ఏపీ సర్కార్ విజ్ఞప్తికి సరేనంది.
ఏపీ నుంచి వివిధ పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్ లైన్లకు ఆయా రాష్ట్రాలు ట్రాన్స్ కోకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా లైన్ల ఛార్జీలను చెల్లించాల్సిన ఆయా రాష్ట్రాలు మౌనంగా ఉండిపోవడంతో ఈ బకాయిలు రూ.114 కోట్లకు చేరుకున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో మొదలైన ఈ బకాయిల తంతు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతోంది. దీంతో వీటిని ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతోంది.
2014-15 నుంచి 2018-19 వరకూ అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో వసూలు కావాల్సిన ఈ ఛార్జీల్ని ఆయా రాష్ట్రాలు చెల్లించడం లేదు. కేంద్రం కూడా దీనిపై స్పందించలేదు. దీంతో వాటిని, అలాగే సరఫరా నష్టాల్ని కూడా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ట్రాన్స్ కో తరఫున ప్రభుత్పం చేసిన విజ్ఞప్తులపై కేంద్రం స్పందించింది. దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ పిటిషన్ పై విచారణ జరిపి ఈ రూ.114 కోట్ల ఛార్జీల బకాయిల వసూలుకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది.
అయితే 2014-15 నుంచి కాకుండా కేవలం 2016-17 నుంచి 2018-19 వరకూ మాత్రమే ఈ ఛార్జీల వసూలుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. మామూలుగా చూస్తే ఈ మొత్తం చిన్నదే అయినా విద్యుత్ సంస్ధల ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా చూస్తే మాత్రం పెద్దదే. దీంతో ప్రభుత్వం దీనిపై వరుస ప్రయత్నాలు చేసి రాబట్టుకునేందుకు అనుమతి సాధించింది.
0 Comments:
Post a Comment