ఉపాధ్యాయ బదిలీల్లో 9 వేల పోస్టులు బ్లాక్
♦️ఎస్జీటీలు 5,884, సబ్జెక్టు టీచర్లు 3,310 ఆన్లైన్లో మాయం
♦️కొన్నిచోట్ల 40 మంది విద్యార్థులకు ఒక్కరే ఎస్జీటీ
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ బదిలీల్లో భారీగా పోస్టులను బ్లాక్ చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ), సబ్జెక్టు టీచర్లు కలిపి 9వేలకు పైగా పోస్టులను ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసింది. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ, మరికొన్ని జిల్లాల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకు పోస్టులు బ్లాక్ చేసింది. బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయులు సోమవారం నుంచి పాఠశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాల్సి ఉండగా, సర్దుబాటు మేరకు మాత్రమే ఆన్‌లైన్‌లో ఖాళీలను చూపారు. పాఠశాల విద్యాశాఖలో ఖాళీ పోస్టులు భారీగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న వారినే సర్దుబాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలలకు తరలించినందున, సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించారు. దీంతో కొన్ని జిల్లాల్లో ఎస్జీటీల కొరత ఏర్పడింది. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు ఎస్జీటీలకు అవకాశమిచ్చినా కొందరు ఉపాధ్యాయులు అంగీకారం తెలపలేదు. అలాంటి చోట సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మరోపక్క హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ బోధనకు 1,746 మంది స్కూల్ అసిస్టెంట్లను పదోన్నతులతో భర్తీ చేశారు.
* ఖాళీల సర్దుబాటుకు బ్లాక్ చేసిన పోస్టుల్లో కేటగిరీ-1, 2, 3వి అధికంగా ఉన్నాయి. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయించాలి. 21-60 మంది పిల్లలుంటే ఇద్దరిని నియమించాలి. ఎస్జీటీల కొరత ఉన్నచోట 30-40మంది విద్యార్థులున్నా ఒక్కరినే ఇస్తున్నారు. 21కి మించి విద్యార్థులున్న బడులకు ఇద్దరు ఎస్జీటీలను కేటాయిస్తే.. కొన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులు సరిపోని పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఆయా జిల్లాల్లో ఇప్పుడున్న టీచర్ల సంఖ్య మేరకే ఖాళీలను చూపారు. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గత బదిలీల్లో 15వేల పోస్టులను బ్లాక్ చేయగా.. ఈసారి ఎస్జీటీ, సబ్జెక్టు టీచర్ల వారీగా చేశారు.
0 Comments:
Post a Comment