AP| Congress: ఏపీలో మళ్లీ పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ రెడీ.. అదే ఆయుధంగా మారనుందా ?
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పట్టు సాధించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పలు వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏపీ, తెలంగాణగా విభజించిన తరువాత సీన్ మారిపోయింది.
తెలంగాణలో ఆ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్(Congress) వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నిక కాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ప్రత్యేక హోదా ఇవ్వాలనేది వ్యూహంలో భాగం. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసినా, వేయకపోయినా కేంద్రంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏపీలో తన భారత్ జోడో యాత్రలో చేసిన వాగ్దానాన్ని ఇది నొక్కి చెబుతుంది. పార్లమెంట్‌లో ఏపీ విభజనకు పార్టీగా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ హామీని విస్మరించడంతో ఈ హామీ ప్రజల్లోకి దూసుకుపోతుంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన రాహుల్ ఎపిలో కూడా పార్టీ నేతలతో త్వరలోనే ముఖాముఖి నిర్వహించనున్నారు. జులై నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎపి పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన జరగనుంది. ఈ జిల్లా పర్యటనలో ముందుగా ఆయన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇంటిని సందర్శిస్తారని తెలిసింది. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు.
ఆ తరువాత పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలిసింది. రాహుల్ గాంధీ ఎపి సంబంధించి ఏఐసీసీ కార్యాలయం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి లేఖ అందినట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో తమ పార్టీ గత ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తినడానికి ఒక కారణంగా సోషల్ మీడియాలో బాగా వీక్ గా ఉండటం కూడా ఒక కారణమని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆ మేరకు పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుండి సోషల్ మీడియాలో పార్టీతో పాటు తమ నేతలు కూడా బాగా యాక్టీవ్ గా ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో తన ఐటీ విభాగాన్ని బాగా పటిష్ఠం చేసుకున్న కాంగ్రెస్ తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు దీనికి సంబంధించి ప్రత్యేక రూల్స్ పెట్టింది.
ఇంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి అంగ, అర్థ, సామాజిక బలాలను మాత్రమే రాజకీయ పార్టీలు బేరీజు వేసుకునేవి. కానీ, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకు వినూత్న నిబంధనలు పెట్టింది. వారికి సోషల్ మీడియా బలాన్ని సైతం పోటీకి అర్హతగా పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఆ రాష్ట్రంలో టిక్కెట్ ఆశించే అభ్యర్థులకు పీసీసీ పెట్టిన కొత్త రూల్స్ పెట్టింది..ఇవి.1)ఆశావాహులందరికీ కచ్చింగా ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు ఉండాలి2) అతడి ఫేస్ బుక్ పేజీకి కనీసం 15,000 లైకులు ఉండాలి3) ట్విట్టర్ లో కనీసం 5000 మంది ఫాలోవర్లు ఉండాలి4) స్థానికంగా పెద్దసంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో అభ్యర్థి చేరి ఉండాలి5) ఆశావహులంతా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పెట్టే పోస్టులను రిట్వీట్ చేయడంతో పాటు లైక్ చేయాలి6) పార్టీ అధికారిక పేజీలో పెట్టే పోస్టులను తమ పేజీల్లో షేర్ చేసుకోవాలి. 7)డిసెంబర్ లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు అంతా ఈ నెల 15 తేదీ లోగా తమ సోషల్ మీడియా ఖాతాలను పార్టీకి అందజేయాలి.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన ఈ నిబంధనలు ప్రస్తుతానికి మధ్య ప్రదేశ్ లోనే విధించినా త్వరలో అన్ని రాష్ట్రాల్లో పెట్టే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఈ నిబంధనలు విధించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు ఆ దిశలో కూడా పరిపుష్టం అయేందుకు ప్రయత్నం చేయడం ఆవశ్యమని సూచిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడి కంటే ఇప్పటినుంచే ఆశావాహులు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారితే మేలని సలహా ఇస్తున్నారు.
0 Comments:
Post a Comment