12వ పిఆర్సిపై కదలిక - సిఎంఒ ఆదేశం
🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగుల అంశాల్లో కీలకమైన 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన దస్త్రాలను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. వేతన సవరణ సంఘం ఏర్పాటు ద్వారా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఖరారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సంఘం ఇటీవల ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించింది. ఈ నెలాఖరుతో 11వ వేతన సవరణ సంఘం కాలపరిమితి పూర్తవుతుందని, అందువల్ల వెంటనే 12వ పిఆర్సిని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు కోరారు. జులై 1 నుంచి కొత్త వేతన స్కేల్ అమలు చేయాల్సి ఉంటుందని కూడా తమ లేఖలో కోరారు. ఇతర అంశాలను కూడా పరిష్కరించేందుకు 12వ పిఆర్సి ఏర్పాటుచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఫైలును సర్క్యులేట్ చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనంజయరెడ్డి సర్క్యులర్ పంపించారు.
0 Comments:
Post a Comment