ఒక దేశానికి ఉపరాష్ట్రపతి అంటే ప్రజలు ఎంత గౌరవమర్యాదలు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలోని అత్యున్నత పదవుల్లో ఇదొకటి.
అలాంటి పదవిని ఊరికే ఇచ్చేయరు. ప్రజల కోసం ఎంతో సేవ చేస్తే గానీ ఇలాంటి పదవి దక్కదు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో రాణించిన నాయకులు, ప్రజల బాగు కోసం విశేషంగా కృషి చేసిన వారికి ఈ పదవి దక్కుతుంది.
ఈ పీఠాన్ని అధిరోహించిన వారిలో తెలుగు నేల నుంచి వెంకయ్య నాయుడు ఒకరు. తన వాక్చాతుర్యంతో రాజకీయాల్లో చక్రం తిప్పిన వెంకయ్య.. ఉపరాష్ట్రపతిగానూ తనదైన మార్క్ చూపించారు. ఆయన తర్వాత ఆ పదవి జగదీప్ ధన్కర్కు దక్కింది.
వెంకయ్యలాగే జగదీప్ కూడా ఆ పదవికి మరింత వన్నె తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే, ఎవరి జీవితంలోనైనా తల్లిదండ్రుల తర్వాత నిజమైన మార్గనిర్దేశకులు అంటే గురువులనే చెబుతారు.
పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు దైవంతో సమానమని పెద్దలు చెబుతారు. మంచి-చెడులతో పాటు జీవితాన్ని ఏ కోణంలో నుంచి చూడాలి, ఎలా ఎదగాలి అనే అంశాలను పిల్లలకు నేర్పేది టీచర్లే.
అందుకే కొందరు ప్రముఖులు ఎంత ఎత్తుకు ఎదిగినా తమకు పాఠాలు నేర్పిన గురువుల్ని మాత్రం మర్చిపోరు. వారు కనిపించగానే గౌరవభావంతో మెలుగుతారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా తన చిన్ననాటి టీచర్‌ను కలిశారు.
కేరళలోని పన్నియన్నూర్లో ఉంటున్న ఉపాధ్యాయురాలు రత్న నాయర్‌ను.. 55 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు ధన్కర్. తనకు వెల్కమ్ చెప్పేందుకు బయటకు వచ్చిన చిన్ననాటి టీచర్ నాయర్‌కు పాదాభివందనం చేశారాయన.
ఆమె కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు ధన్కర్. ఉపరాష్ట్రపతి తన చిన్ననాటి టీచర్‌కు పాదాభివందనం చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
0 Comments:
Post a Comment