టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
ఒకట్రెండు రోజుల్లో జిల్లాల వారీగా ఉత్తర్వులు
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు
*అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి):* ఉపాధ్యాయ బదిలీలకు లైన్ క్లియర్ అయింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసేలోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోలను ఒకట్రెండు రోజుల్లోనే జారీ చేయనుంది. అయితే ఈసారి ఉమ్మడి జిల్లాల వారీగా వేర్వేరు జీవోలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ, జడ్పీ యాజమాన్యాల వారీగా కూడా జీవోలు ఇస్తారు. దీనివల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఒక జిల్లా లేదా ఒక మేనేజ్‌మెంట్ వరకే పరిమితమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయం లో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బదిలీలు చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబరులో బదిలీలకు జీవోలు ఇచ్చినా కొందరు కోర్టులకు వెళ్లడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బదిలీల్లో టీచర్లకు 8 విద్యా సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. దీనికి మే 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. హైస్కూల్ ప్లస్‌లలో బోధన నిమిత్తం చేపట్టిన పదోన్నతుల ప్రక్రియపై పాఠశాల విద్యాశాఖ మాట మార్చింది. సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పీజీటీలుగా పదోన్నతి కల్పిస్తామని మొన్నటివరకూ చెప్పినా.. ఇప్పుడు వారు పీజీటీలు కార ని, స్కూల్ అసిస్టెంట్లుగా మాత్రమే ఇంటర్ బోధించాలని స్పష్టం చేసింది. దీన్ని సంఘాలన్నీ వ్యతిరేకించాయి. కానీ ఒక ఇంక్రిమెంట్‌తో పని సర్దుబా టు కింద వారిని కొనసాగిస్తామని, పదోన్నతి కాదని మంత్రి తేల్చిచెప్పారు. 294 హైస్కూల్ ప్లస్‌లలో 1,746 మందిని ఈ విధానంలో ఇంటర్ బోధనకు నియమించనున్నారు. అలాగే 350 గ్రేడ్-2 హెచ్‌ఎం పోస్టుల ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని, 6,269 మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు. 679 కొత్త ఎంఈవో-2 పోస్టులను పదోన్నతితో భర్తీ చేయనున్నారు.
*టీచర్లు కోరుకున్నట్లే..: బొత్స*
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను బడులు తెరిచేలోపు పూర్తిచేస్తామని మంత్రి బొత్స తెలిపారు. ప్రతి తరగతికి, ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. వీలైనంత త్వరగా బదిలీలు పూర్తిచేసి, ఆ వెంటనే పదోన్నతులు ఇస్తామన్నారు. టీచర్లు కోరుకున్న విధంగానే బదిలీల మార్గదర్శకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే, హైస్కూల్ ప్లస్‌లలో చేపడుతున్న భర్తీప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇస్తే 2 ఇంక్రిమెంట్లతో రెగ్యులర్ పదోన్నతి ఇవ్వాలని, లేదంటే వద్దని చర్చల్లో సంఘాల నేతలు స్పష్టం చేశారు. చర్చల్లో.. యూటీఎఫ్ నుంచి ఎన్.వెంకటేశ్వర్లు, ప్రసా ద్, ఎస్టీయూ నుంచి ఎల్ సాయిశ్రీనివాస్ ,తిమ్మన్న ఎస్.చిరంజీవి, ఏపీటీఎఫ్-257 నుంచి సీహెచ్ మంజుల, ఏపీటీఎఫ్-1938 నుంచి జి.హృదయరాజు, ఆప్టా నుంచి సీహెచ్ ప్రకాశరావు, పీఆర్‌టీయూ నుంచి వి.కరుణానిధిమూర్తి, నవ్యాంధ్ర టీచర్ల సంఘం నుంచి మాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment