ఆమె వయసు ఐదు పదులు దాటింది.
ప్రస్తుతం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలిగా ఉన్న ఆమె విద్యార్హతను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
కానీ బడికో..కాలేజీకో పోయి మిగతా విద్యార్థులతో కలిసి చదువుకునే వయసు ఆమెది కాదు. ఇంతకీ ఎవరామే? అసలు ఎంతవరకు చదువుకుంది? ఎందుకు విద్యార్హత పెంచుకోవాలనుకుంటున్నది తెలియాలంటే ఇది చదివేయండి.
వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి చెందిన చిలక పద్మ ప్రస్తుతం జైనథ్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలిగా ఉన్నారు. అయితే సర్పంచ్ కావాలని ఆమె కోరిక.
కానీ ఆమె కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఇందుకోసం విద్యార్హత పెంచుకోవాలని అనుకుంది.
కానీ మిగతా విద్యార్థులతో కలిసి బడికో..కళాశాలకో..వెళ్ళి చదువుకునే వయసు ఆమెది కాదు. పదవ తరగతి ఉత్తీర్ణురాలు కావాలని అనుకుంది.
ఆమె లక్ష్యాన్ని సాధించుకునేందుకు దూర విద్య ద్వారా తన విద్యా అర్హతను పెంచుకోవాలని అనుకున్నారు.
ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి పరీక్షలకు ఫీజు కట్టారు. గత నెల 28వ తేదీ ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా..ఈ నెల మూడవ తేదీతో ముగిశాయి.
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న చిలుక పద్మకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1లో సెంటర్ పడింది. జైనథ్ నుండి వచ్చి పోతూ పరీక్షలు రాసింది. పరీక్ష రాసేందుకు తన భర్త చిన్నన్న, మనవడితో కలిసి పరీక్షా కేంద్రానికి రావడం ఆసక్తిని కలిగించింది.
గ్రామ సర్పంచ్ కావాలంటే పదవ తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలన్న నిబంధన ఉంటే తన లక్ష్యానికి అడ్డుకాకూడదని ఆమె భావించింది. అంతేకాకుండా చదువుకున్న వారు ప్రజాప్రతినిధులైతే ప్రజలకు మరింత సేవ చేయడానికి వీలువుతుందని పద్మ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఉంటే దూర విద్యా విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో నిమిత్తం లేకుండా చదువుకునేందుకు, తమ విద్యార్హతలను పెంచుకునేందుకు మంచి అవకాశం లభించింది.
ఎందరో మంది వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన తమ చదువులను, చదువుకోవాలని ఉన్నా చదువుకునే అవకాశం రాకపోయిన వారు దూర విద్యా విధానం ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు.
భవిష్యత్తులో సర్పంచ్ కావాలన్న ఆసక్తితో పదవ పరీక్షలు రాసిన చిలుక పద్మ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుందాం.
0 Comments:
Post a Comment