✍️గురువులతో గొడ్డుచాకిరి!
♦️వేసవి సెలవుల్లోనూ స్కూళ్లకు రావాల్సిందే
♦️చదువంటే మాకిష్టం' పేరుతో పలు బాధ్యతలు అప్పగింత
♦️మానవతా విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
♦️పొడుపు కథలు, సామెతలు చెప్పాలి
♦️టెన్త్ తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
♦️లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వకుండానే పనిభారం
♦️ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు తీవ్ర నిరసన
*🌻(అనకాపల్లి-ఆంఽధ్రజ్యోతి)*
ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను నానాటికీ అధికం చేస్తోంది. పలు రకాల బోధనేతర పనులతో నాలుగేళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకులు... ఈ ఏడాది వేసవి సెలవుల్లో మరిన్ని పనులు అప్పగించింది. దీంతో వేసవి సెలవులు విద్యార్థులకే తప్ప ఉపాధ్యాయులకు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం వేసవిలో సెలవులు లేకుండా చేయడమే కాకుండా.. బోధనేతర పనిభారాన్ని మోపుతున్నదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సమ్మర్ వెకేషన్ పేరుతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మే నెలలో సెలవులు ఇచ్చేవారు. వేసవి సెలవుల పూర్తి కావడానికి వారం రోజుల ముందు ఉపాధ్యాయులంతా పాఠశాలలకు హాజరై, గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేవారని, ఇదే సమయంలో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేసే వారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వేసవి సెలవులు విద్యార్థులకే తప్ప ఉపాధ్యాయులకు కాదని మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.
ఏటా ఏప్రిల్ చివరి వారంలో పాఠశాలలకు విద్యా సంవత్సరం ముగుస్తుంది. జూన్ రెండో వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ మధ్య కాలంలో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. దీంతో ఉపాధ్యాయులు కూడా సెలవులు తీసుకొనే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఉపాధ్యాయులకు ఏడాది కాలంలో ఆరు మాత్రమే ఆర్జిత సెలవులు ఉంటాయి. ఇతర శాఖల ఉద్యోగులకు 30 వరకు ఆర్జిత సెలవులు వుంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధ్యాయులకు వేసవి సెలవులు లేవనే సంకేతాలు పంపింది.
♦️టీచర్లపై 'వేసవి' బాధ్యతలు
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు పలు బాధ్యతలు అప్పగించారు. 'చదువంటే మాకిష్టం' పేరుతో వివిధ కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికను రూపొందించి వాటిని నిర్వహించాలని ఉపాధ్యాయులకు పంపారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, నైపుణ్యాలు పెరిగేలా అవగాహన కల్పించాలి. పొడుపు కథలు, సామెతలు వంటివి చెప్పాలి. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు విధిగా ఈ తరగతులకు హాజరవ్వాలి. ప్రభుత్వం ఉచితంగా అందించే నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, విద్యాదీవెన కిట్లును మండల కేంద్రంలోని స్టాక్ పాయింట్‌లో తీసుకొని పాఠశాలలకు చేరవేయాలి. స్కూళ్లు తెరిచే వరకు వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. ఈ బాధ్యతలు, పనులకు సంబంధించి విద్యా శాఖాధికారులు లిఖిత పూర్వకంగా కాకుండా కేవలం మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. విద్యా సంవత్సరం మొత్తంలో అనేక రకాల బోధనేతర పనులను అప్పగించి వేధిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వేసవి సెలవుల్లో కూడా పలు రకాల పనుల పేరుతో వేధిస్తున్నదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
♦️లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీచేస్తేనే...
- ▪️గొంది చినబ్బాయ్, చైర్మన్, ఫ్యాప్ట్టో, అనకాపల్లి జిల్లా
ఉపాధ్యాయులతో వేసవి సెలవుల్లో పనులు చేయించుకోవడానికి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా విద్యాశాఖాధికారులు నోటి మాటగా ఆదేశాలు జారీ చేయడం సరికాదు. ఇది సరైన విధానం కాదు. న్యాయబద్ధం కూడా కాదు. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో పని చేయాలంటే ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే ఆర్జిత సెలవులు వర్తింపజేయాలి. 'చదువంటే మాకిష్టం' కార్యక్రమంపై విద్యా శాఖ నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు అందితేనే విధుల్లో పాల్గొంటాం.
0 Comments:
Post a Comment