ఐరోపాలో అందమైన దేశాల్లో స్పెయిన్(Spain) ఒకటి.
ఇది ఎన్నో పర్యాటక ప్రాంతాలకు నెలవు. అయితే, కొంత కాలం తర్వాత స్పెయిన్ గురించి ఇలా చెప్పుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు.
ఎందుకంటే ఆ దేశం ప్రస్తుతం ప్రమాదంలో పడింది. వాతావరణం కారణంగా అక్కడ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. క్రమంగా అది కరవుకు దారితీస్తోంది.
ఇక భవిష్యత్తులో స్పెయిన్ ఎడారి దేశం కాబోతోందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. మరి, స్పెయిన్‌లో ఇంతటి దుర్భర పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? ఈ దుస్థితి నుంచి బయటపడటానికి అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాలను తెలుసుకుందాం.
దెబ్బతీసిన వర్షపాతం లేమి : సాధారణంగా ఏటా స్పెయిన్‌లో సగటు వర్షపాతం నమోదవుతుంది. కానీ, గత కొద్ది సంవత్సరాల నుంచి వర్షపాతం తగ్గుతూ వస్తోంది.
ఈ ఏడాది మార్చిలో కేవలం 36 శాతం వర్షపాతం నమోదైంది. వందేళ్ల చరిత్రలో ఇదే రెండో అత్యంత కనిష్ఠం వర్షపాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఫలితంగా దేశంలోని ప్రధాన నీటి రిజర్వాయర్లు అడుగంటి పోయాయి
ముఖ్యంగా తాగునీటిని అందించే నీటి వనరులు తగ్గిపోవడంతో అసలు సమస్య మొదలైంది. స్పెయిన్‌లోని ప్రధాన నగరమైన బార్సిలోనాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే 'ద సా' రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఈ ఏప్రిల్‌లో 7 శాతానికి చేరుకుంది. క్యాటలోనియాలోని మిగతా రిజర్వాయర్లు దాదాపు 25 శాతం నీటితో నిండి ఉన్నాయి. ఇది చాలా తక్కువ.
మండే ఎండలు : ఓ వైపు వర్షాలు తగ్గిపోయాయని బాధపడుతుంటే మరోవైపు, ఎండలు పెరగడం స్పెయిన్ వాసులను ఎంతో ఇబ్బంది పెట్టింది.
ఏప్రిల్ నెలలో స్పెయిన్ నగరాల్లో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1961 తర్వాత అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైంది ఈ ఏప్రిల్‌లోనే. కొన్ని ప్రావిన్సులలో ఉష్ణోగ్రత 38.7 డిగ్రీల వరకు రికార్డైంది.
అటు వర్షపాతం తక్కువైపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో స్పెయిన్‌లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి గతేడాది డిసెంబర్ నుంచే దీర్ఘకాల కరవు సూచనలు కనిపించాయి.
భౌగోలికంగా కూడా స్పెయిన్‌లో ఎక్కువ వేడి ఉంటుంది. అప్పుడప్పుడు కరువు పరిస్థితులు నెలకొంటాయి. కానీ, వాతావరణంలో మార్పు కారణంగా సమస్య తీవ్రమైందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని 27 శాతం భూభాగంలో డ్రాట్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
వ్యవసాయంపై ప్రభావం : నీటి సంక్షోభం కారణంగా దేశంలోని వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. అక్కడ జొన్న, మొక్కజొన్న, గోధుమ, తదితర పంటలు పండించే రైతులకు నీరు కరవైంది. ఫలితంగా సాగు భూమి పూర్తిగా ఎడారిని తలపిస్తున్నాయని అక్కడి రైతన్నలు వాపోతున్నారు. దీంతో ఉత్పత్తి పడిపోయింది.
ఆహారానికి డిమాండ్ పెరిగింది. ఈ కరవు కారణంగా దాదాపు 86 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. దేశంలోని సాగుభూమిలో ఇది 60 శాతం కావడం గమనార్హం. అటు జీవాలకు మేత కరవైంది. వీటితో పాటు ఆలివ్ ఆయిల్, పండ్ల తోటలు, కూరగాయల సాగుపై కూడా ప్రభావం చూపనుంది.
ప్రభుత్వం ఏం చేస్తోంది? : కరవు ముప్పు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి స్పెయిన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నష్ట నివారణ చర్యల కోసం రూ.196 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
వీటితో పాటు మరి కొన్ని నిధులు కేటాయించి తాగునీటి వనరులపై ఫోకస్ పెట్టింది. ఒకసారి వినియోగించిన నీటిని మళ్ళీ సేకరించి శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
0 Comments:
Post a Comment