Sengol in New Parliament: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం 28న (ఆదివారం) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు కేంద్రంలోని మోడీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని (సెంగోల్) ను ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.
బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని (స్వాతంత్ర్యం) అప్పగిస్తూ.. ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్' అని పిలుస్తారు. ఇది తమిళ పదం 'సెమ్మై' నుంచి ఉద్భవించింది.. దీని అర్థం 'ధర్మం'..
బంగారు 'సెంగోల్' (రాజదండం) స్వాతంత్ర్యానికి 'ముఖ్యమైన చారిత్రక' చిహ్నమని.. ఇది బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని భారతీయులకు బదిలీ చేయడాన్ని సూచిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
'ఈ సెంగోల్‌కు చారిత్రక ప్రాముఖ్యత ఉంది… ఆగస్ట్ 14, 1947 రాత్రి 10.45 గంటల సమయంలో.. పండిట్ నెహ్రూ తమిళనాడు నుంచి ఈ రాజదండంను స్వీకరించారు.
పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో.. ఆయన దీనిని స్వాతంత్ర్యానికి చిహ్నంగా అంగీకరించారు. బ్రిటీషర్ల నుంచి ఈ దేశ ప్రజలకు అధికార మార్పిడికి ఇది ఒక సంకేతం' అని అమిత్ షా అన్నారు.
ముఖ్యంగా తమిళ సంస్కృతిలో సెంగోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. 'చోళ రాజవంశం కాలం నుంచి ఈ రాజదండం ముఖ్యమైనది.. అలాంటి ఈ సెంగోల్ కొత్త పార్లమెంట్‌లో ఉంచుతారు.. PM మోడీ ఈ సెంగోల్‌ను తమిళనాడు నుంచి స్వీకరించి దానిని స్పీకర్ సీటు దగ్గర ఉంచుతారు.' అని పేర్కొన్నారు.
ఇది ఒక చారిత్రక కార్యక్రమం కానుందని.. ఇది భారతదేశంలో అమృత కాలాన్ని గుర్తు చేస్తుందని అమిషా పేర్కొన్నారు. రాజదండాన్ని అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంచామని, దీనిని కొత్త పార్లమెంటు భవనానికి తరలించనున్నట్లు షా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జీ. కిషన్ రెడ్డి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా.. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ భారతదేశ విజయాలు, చరిత్ర అందరికీ తెలిసేలా ఈ వేడుకలను ఏడాది పొడవునా నిర్వహిస్తోంది.
"హర్ ఘర్ తిరంగ", "వందే భారతం" "కళాంజలి" వంటి అనేక మెగా ఈవెంట్‌లతో సహా AKAM ఆధ్వర్యంలో 1.36 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించింది.
0 Comments:
Post a Comment