Sengol In Parliament : కొత్త పార్లమెంట్ లో సెంగోల్ రాజదండం
నూతన పార్లమెంటు సావర్కర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీన ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నూతన పార్లమెంటులో రాజరికాన్ని తలపించేలా స్పీకర్ సీటు సమీపంలో రాజదండనను పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం వెల్లడించారు.
ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ.. 'రాజదండాన్ని 'సెంగోల్' అని పిలుస్తారు. ఇది తమిళపదం 'సెమ్మై' నుండి ఉద్భవించింది. అంటే దీనర్థం 'ధర్మం'. బ్రిటిష్ ఇండియా యొక్క చివరి వైస్రారు లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూని అడిగిన ప్రశ్న వల్ల ఈ సెంగెల్ ఉనికిలోకి వచ్చింది. చారిత్రక కథనాలు, వార్తా నివేదికల ప్రకారం.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికార మార్పిడికి గుర్తుగా ఉండబోయే దానిపై ప్రధానమంత్రి నెహ్రూని అడిగారట. దీంతో ప్రధాని నెహ్రూ అధికారి మార్పిడి గుర్తు గురించిన సలహా కోసం గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారిని ఆశ్రయించారు. రాజగోపాలాచారిని అందరూ రాజాజీ అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో రాజీజీ... 'కొత్తరాజు అధికారంలోకి రాగానే రాజదండం అప్పగించే తమిళ సంప్రదాయం గురించి ప్రధాన మంత్రి నెహ్రూకి చెప్పారు. చోళుల పాలనలో ఈ సంప్రదాయాన్ని అనుసరించారని, ఇది భారతదేశానికి రాజ్ నుండి స్వేచ్ఛను సూచించగలదని సూచించినట్లు నివేదికలు తెలిపాయని రాజాజీ నెహ్రూకి చెప్పారు.
రాజదండం తయారీ..
నెహ్రూ సలహా మేరకు రాజదండం ఏర్పాటు చేయడం రాజాజీపై పడింది. భారతదేశ స్వాతంత్య్రానికి గుర్తుగా రాజదండం ఏర్పాటు చేయడంపై రాజాజీ ప్రస్తుత తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనం మఠంను సంప్రదించారు. ఆ మఠాధిపతి ఆ బాధ్యతను స్వీకరించారు. అప్పటి మద్రాసులో నగల వ్యాపారి వుమ్మిడి బంగారు చెట్టి ఐదు అడుగుల పొడువుతో.. పైన 'నంది'తో ఉన్న సెంగోల్‌ని తయారుచేశారు. ఇది న్యాయానికి ప్రతీక. నివేదిక ప్రకారం మఠంలోని ప్రధాన పూజారి మొదట రాజదండాన్ని మౌంట్ బాటన్‌కి అప్పగించారు. ఆ తర్వాత ఆ రాజదండాన్ని భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించే 15 నిమిషాల ముందు ఆ రాజదండంపై గంగాజలాన్ని చల్లి.. ప్రధానమంత్రి నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయనకు అప్పగించారు. ప్రధాని నెహ్రూ రాజదండం అందకునే సమయంలో ప్రత్యేకంగా ఓ గీతాన్ని కూడా రూపొందించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా సెంగోల్ చరిత్ర, దాని ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలియదని అమిత్‌షా అన్నారు.
కాగా, ప్రధాని సూచన మేరకే కొత్త పార్లమెంటులో రాజదండాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అమిత్‌షా తెలిపారు. 'మన సంస్కృతి, సంప్రదాయాలను మన ఆధునికతతో ముడిపెట్టే విధంగా ఇలా రాజదండాన్ని పార్లమెంటులో పెట్టే ప్రయత్నాన్ని ప్రధాని చేశారు' అని అమిత్‌షా అన్నారు. కొత్త పార్లమెంట్‌లో సెంగోల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ప్రధాని మోడీ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని షా అన్నారు. ప్రస్తుతం ఈ రాజదండం అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇకపై పార్లమెంటు దాని చిరునామాగా మారనుందని ఆయన అన్నారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..'సెంగోల్‌ను రాజకీయాలతో ముడిపెట్టరాదు' అని నొక్కి చెప్పారు. అలాగే 'పరిపాలన చట్టబద్దంగా నడపాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఎల్లప్పుడూ మాకు గుర్తుచేస్తుంది. అని ఆయన అన్నారు. అయితే ఈ రాజదండం అలహాబాద్ మ్యూజియంలో ఉంచడానికి గల కారణాలపై.. దాని చరిత్రపై దృష్టి సారించే పనిలో ప్రస్తుతం కేంద్రం ఉంది.
0 Comments:
Post a Comment