Secretariat Employees: సచివాలయ ఉద్యోగులపై నిఘానేత్రం!
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 'కృతజ్ఞత' చూపలేదని గుర్రు
ఎన్నికల ఏడాది కావడంతో వారితీరుపై భయాలు..
ఒక్కో సచివాలయంలో రెండేసి కెమెరాలు
24 వేలు ఖర్చు.. పశ్చిమలో మొదలైన ప్రక్రియ..
ఆ తర్వాత మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటుచేసే యోచన
సచివాలయాలు జగన్ మానసపుత్రికలు...సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఆయన సృష్టించిన ఉద్యోగులంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ కొత్తగా 1.36 లక్షల పోస్టులు సృష్టించి ఇచ్చినా... సచివాలయ ఉద్యోగుల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోయింది. పార్టీ కార్యకర్తలుగా ఉండి వలంటీర్లు అయినవారినీ, పరీక్షలు రాసి పోస్టులోకి వచ్చిన సచివాలయ ఉద్యోగులనూ ఒకేగాటన గట్టాలని, అడ్డమైన పనులు వారితోనూ చేయించుకోవాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. జగన్ తమకు జీవితం ఇచ్చారనే భావన కంటే, తీరని అన్యాయం చేశారనే వ్యథే వారిలో నిండేలాచేశాయి. దీంతో మిగతాప్రభుత్వ ఉద్యోగుల్లాగే సచివాలయ ఉద్యోగులనూ వేధించేందుకు సర్కారు సిద్ధమైంది. వారిపై నిఘానేత్రం నాటనుంది.
పశ్చిమ గోదావరి జిల్లా గొరగనమూడి సచివాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న దృశ్యం
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జగన్ పార్టీకి చెందిన అభ్యర్థులకు సచివాలయ ఉద్యోగులంతా ఓట్లు వేస్తారని సర్కారు ఆశలు పెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. సచివాలయ ఉద్యోగులు కూడా, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తన పట్ల కృతజ్ఞతతో లేరనే అనుమానాలు ముఖ్యమంత్రి జగన్‌లో బలపడుతున్నాయి.
'పశ్చిమ'లో మొదలైన పనులు
పాలకోడేరు, మే 15: పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 1160 సచివాలయాల్లో సీసీ కెమెరాలు బిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో పాలకోడేరు మండలం గొరగనమూడి తదితర గ్రామాల్లోని సచివాలయాల్లో సోమవారం నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. మోనటరింగ్ ప్రక్రియ అంతా మండల పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, విధి నిర్వహణ, సమయ పాలన విషయంలో సచివాలయ వ్యవస్థలను బలోపేతం చేయడానికే సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు తెలిపారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై జగన్ సర్కారుకు అనుమానమొచ్చింది. వలంటీర్లతో అడ్డగోలు పనులు చేయిస్తున్న వైసీపీ ప్రభుత్వం, అదే ధోరణిలో సచివాలయ ఉద్యోగులతోనూ వ్యవహరించడానికి ప్రయత్నించి చాలావరకు విఫలమైంది. అప్పటినుంచి వారిని టార్గెట్ చేసిందని చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఫేస్ రికగ్నయిజ్ హాజరు వంటి నిబంధనలతో ఇప్పటికే కాల్చుకుతింటోంది. ఇప్పుడు ఏకంగా వారి పనితీరుపై అనుమానంతో నిఘా నేత్రం వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వలంటీర్లు తెచ్చిన పనులే చేయాల్సిన పరిస్థితిని సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సచివాలయ ఉద్యోగుల పట్ల జనంతో వ్యతిరేక భావన రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు వలంటీర్ల దయాదాక్షిణ్యాలతో పేదలు, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు దక్కడం ప్రజాస్వామ్య విరుద్ధమనే భావనలో ఎక్కువమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ నిరంకుశత్వం విషయంలో మానసికంగా విభేదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులపై మరింతగా గురిపెట్టారు. ప్రతి సచివాలయాల్లో సీసీ నిఘా కెమెరాలు పెట్టాలని యోచిస్తోంది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల సూచనతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఒక్కో సచివాలయానికి సుమారు రూ.24 వేల వ్యయంతో (రూ.12వేలు చొప్పున) సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై ఒక మెమో రూపొందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1120 గ్రామ, వార్డు సచివాలయాల్లో 2240 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ధరలు నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముందుగా ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఆ తర్వాత మిగతా అన్నిజిల్లాల్లో దీని అమలు చేయడానికి సర్కారు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ఎప్పుడు వస్తున్నారు.. ఎప్పుడు వెళుతున్నారు.. అసలు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారా లేదా అన్నది సీసీ కెమెరాల ద్వారా జిల్లా అధికారులు మోనెటరింగ్ చేస్తారు.
అడక్కుండా ఏదీ ఇవ్వరే..!
సచివాలయాల్లో 545 రకాల సర్వీసులందించాలని చాంతాడంత జాబితా సిద్దంచేశారు. అంతేకాకుండా ఆ సర్వీసులకు సైతం టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి సచివాలయ సిబ్బందిపై వారితో స్వారీ చేయిస్తున్నారు. ఐఏఎస్ తరహాలో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు పెట్టి రికార్డ్ అసిస్టెంట్ కేడర్ పోస్టులో సచివాలయ ఉద్యోగులను నియమించారు. రెండేళ్లకు ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉండగా, ఎనిమిది నెలలు ఆలస్యంగా పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత వారికి రావాల్సిన ప్రతి బెనిఫిట్‌కు ప్రభుత్వం వద్ద దేబిరించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు.
టీచర్లకు ప్రత్యామ్నాయంగా...
సచివాలయ ఉద్యోగులు కిమ్మనకుండా తాము చెప్పిన పనులు చేసుకుపోవాలనే బలమైన కోరిక వైసీపీ నేతల్లో ఉంది. మళ్లీ ప్రభుత్వంలోకి రావాలంటే సచివాలయ వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమని సర్కారు బలంగా నమ్ముతోంది. వలంటీర్లను ఎన్నికల విధుల్లో వాడుకోరాదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలివ్వడంతో సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనే యోచన చేశారు. అందుకే ప్రతి గ్రామంలో సచివాలయ ఉద్యోగులనే బూత్ లెవల్ అధికారులుగా నియమించారు. రాబోయే ఎన్నికల్లో టీచర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకోబోమని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. అప్పుడు కచ్చితంగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ విధులు చేపట్టాలి. అలాంటి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారైతే బూమ్‌రాంగ్ అవుతుందని సర్కారు భావించింది. అందుకే ఎన్నికల వరకైనా సచివాలయ ఉద్యోగులపై నిఘా ఉంచి వారిని తమ దారికి తెచ్చుకోవాలనే యోచన చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు.
0 Comments:
Post a Comment