విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీ
పంగులూరు: పంగులూరులోని జగనన్న విద్యా కానుక, మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న స్టాక్ పాయింట్‌ను ఆయన పరిశీలించి జగనన్న విద్యా కానుక ద్వారా వచ్చిన సామగ్రిని గురించి అధికారులను ప్రశ్నించారు. 3,926 జతల బూట్లు వచ్చాయని, 7,852 సాక్సులు కూడా వచ్చాయని అధికారులు చెప్పారు. అయితే తొమ్మిదో సైజు బూట్లు ఎన్ని వచ్చాయని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించగా, ఆ సైజు బూట్లు రాలేదని అధికారులు తెలిపారు. తొమ్మిదో సైజు రాకపోతే ఆ సైజు కావాల్సిన పిల్లలకు ఏమిస్తారని ప్రవీణ్ ప్రకాష్ అధికారులను నిలదీశాడు. వచ్చిన వాటిని పరిశీలన చేసి, ఏమేమి కావాలి, ఎన్ని కావాలి, అనే విషయమై ఉన్నతాధికారులకు తెలియజేయాలని, వచ్చిన వాటిని దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉపయోగించి విద్యార్థులకు అందించాలని ప్రవీణ్ ప్రకాష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పీవిజె రామారావు, ఆర్జెడి వివి సుబ్బారావు, సీఎంఓ రజిని, మండల విద్యాశాఖ అధికారి కే నాగభూషణం, పంగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఏపిఎం జ్యోతి ప్రసాదు, జేవికే 4 టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment