హై దరాబాద్: తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR)తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి.
ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలు వెల్లడంచారు విజయశాంతి.
'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు...
డాక్టర్ ఎన్టీఆర్ గారు...
నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో...
ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు' అని ఆ మహా నటుడితో సినీ అనుబంధాన్ని విజయశాంతి గుర్తు చేసుకున్నారు.
'నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ...
బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లినప్పుడు, డబ్బింగ్ థియేటర్ వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను) అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతాది' అని ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి విజయశాంతి చెప్పుకొచ్చారు.
అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ "జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry ..." అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే...' అని విజయశాంతి కొనియాడారు.
'ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది.
అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు .
ఆదరాభిమానాలకు మరో రూపు...
ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు.
100 సంవత్సరాలైనా... మరో వంద సంవత్సరాలైనా... సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే... సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే...' అంటూ ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు విజయశాంతి.
0 Comments:
Post a Comment