Mocha Cyclone: ఏపీకి 'మోచా' తుఫాను ముప్పు! రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు!
వర్షం వస్తే అందరి కంటే ఎక్కువ ఆనందించేది రైతే. అదే వర్షం విజృంభిస్తే అందరి కంటే ఎక్కువ ఏడ్చేది కూడా రైతే. వర్షం వచ్చే సందర్భం మీద రైతు జీవితం ఆధారపడి ఉంటుంది.
అదేంటో పంట వేసినప్పుడు రాని వర్షాలు.. పంట చేతికొచ్చాక వస్తాయి. వర్షాలు లేక పంటలకు నీరు సరిపోక ఎలాగోలా తంటాలు పడి నీరు తెచ్చుకుని పంట గొంతు తడిపి పండిస్తే.. చేతికొచ్చాక వర్షాలు ఆ పంటలను మింగేస్తుంటే.. ఇక ఆ రైతు ఏమైపోవాలి. ప్రస్తుతం రైతు పరిస్థితి ఇదే. అకాల వర్షాల కారణంగా రైతులు కంటతడి పెడుతున్నారు. ధాన్యం తడిసిముద్దయ్యిందని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఏపీలో పల్నాడు జిల్లాలో భారీ వర్షం కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి, పొలాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి. కోత సమయంలో పంటలు ఆరబెట్టుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మిర్చి, మొక్కజొన్నలపై బరకాలు కప్పినా గాలికి ఎగిరిపోతున్నాయి. ఈ క్రమంలో మరో పిడుగు లాంటి వార్త రైతుల నెత్తిన పడింది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని తెలిపింది.
రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 6వ తేదీన తుఫానుగా మారుతుందని.. దీని ప్రభావం ఒడిశా, ఏపీ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుఫాను వస్తే దానికి మోచా అనే పేరు పెట్టనున్నారు. గత ఏడాది ఇదే నెలలో మే 22న అసని తుఫాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఏపీ వాతావరణంలో రానున్న 48 గంటల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని ఐఎండీ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
0 Comments:
Post a Comment