Inspiration - తల్లి బాధలు చూడలేక బావిని తవ్విన 14ఏళ్ళ బాలుడు.. ప్రేమంటే ఇదేరా!!
అమ్మ మీద ప్రేమ ఉంటే సరిపోదు. అమ్మ కష్టాలను అర్థం చేసుకునే మంచి గుణం కూడా పిల్లలకు ఉండాలి. తల్లి కన్నీళ్లు తుడిచే ఆలోచన కూడా పిల్లల్లో ఉండాలి.
దానికి వయస్సుతో నిమిత్తం లేదు. అలాంటి ఒక కొడుకు తల్లి కోసం చేసిన సాహసమే ఈ యదార్ధ కథ.
మహారాష్ట్రకు చెందిన ఒక బాలుడు తల్లికి నీటి కష్టాలు తీర్చాడు. మంచినీళ్ళ కోసం నిత్యం కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళి మండుటెండలో కష్టాలు పడుతున్న తల్లి కోసం ఓ 14 ఏళ్ల పిల్లాడు ఎవరూ చెయ్యని సాహసం చేశాడు. అమ్మ నీళ్ల కష్టాలు తొలగించాలని భావించిన కొడుకు వారి ఇంటి ముందు ఒక బావినే తవ్వాడు.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ప్రణవ్ సల్కర్ ప్రతిరోజూ నీళ్లకోసం తల్లి కిలోమీటర్ల దూరం వెళ్లి ఇబ్బందులు పడటాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో తల్లిపై భారాన్ని తగ్గించాలని భావించి ఇంటి ముందు ఒక మిషన్ మొదలు పెట్టాడు. అచంచలమైన అంకితభావంతో, దృఢ సంకల్పంతో ఇంటి ముందు బావిని తవ్వాడు. బాలుడి సంకల్పానికి 20 అడుగుల లోతులోనే నీళ్లు కూడా పడ్డాయి.
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రణవ్ సల్కర్ తన తల్లి కోసం చేసిన పని ఇప్పుడు గ్రామస్తులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణవ్ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. నీళ్ల ఎద్దడి వల్ల ఒక్కోసారి వాళ్ళు పనికి వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రణవ్ సల్కర్ తల్లి కష్టాన్ని తీర్చాలని బావిని తవ్వాడు.
ప్రణవ్ బావిని తవ్వే క్రమంలో రాళ్లను తొలగించడంలో తండ్రి వినాయక్ సహాయం చేశారు. మొత్తంగా బావిని మాత్రం తల్లి కోసం కొడుకే తవ్వాడు. ఇక ఈ విషయం తెలిసిన పంచాయతీ బాలుడి నిబద్ధతను ప్రశంసించి ఆ బావి చుట్టూ ఓ ఎన్క్లోజర్ నిర్మించడమే కాకుండా, నీటి కనెక్షన్ ను కూడా ఏర్పాటు చేశారు. అమ్మ కోసం బావిని తవ్విన ప్రణవ్ చొరవ ను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు.
0 Comments:
Post a Comment