Gold Alert: మీ దగ్గర హాల్‌మార్క్ లేని నగలు ఉన్నాయా? అయితే అలర్ట్
బంగారు నగలపై (Gold Jewellery) హాల్‌మార్క్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గానే ఉంటోంది.
అందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అమలు చేస్తోంది. బంగారు నగలపై హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నెంబర్ తప్పనిసరి చేసింది. ఇకపై ఏ నగల షాపులో అయినా HUID ఉన్న ఆభరణాలు మాత్రమే అమ్మాలి. బంగారు వస్తువులు, ఆభరణాల అమ్మకానికి మరింత పారదర్శకతను తీసుకురావడం కోసం, కస్టమర్‌లు మోసపోకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నియమనిబంధనల్ని రూపొందించింది. అయితే ఈ నిబంధనలు కేవలం బంగారు నగల్ని అమ్మే షాపులకు మాత్రమే కాదు, బంగారు నగలు ఉన్నవారికి కూడా వర్తిస్తాయి.
HUID అంటే ఏంటీ?
బంగారు ఆభరణాలపై ఉన్న హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రతీ నగకు భిన్నంగా ఉంటుంది. ఇది బంగారం స్వచ్ఛతను తెలిపే మార్క్. బంగారు ఆభరణాలపై HUID తప్పనిసరిగా ఉండాలి. HUID ఆరు డిజిట్స్ గల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇందులో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. నగలపై మూడు గుర్తులు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో మొదటి గుర్తు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కి చెందిన హాల్‌మార్క్. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. రెండో గుర్తు నగల్లో బంగారం స్వచ్ఛత తెలియజేసే 18K, 22K అని ముద్ర ఉంటుంది.
మీ పాత నగలపై హాల్‌మార్క్ లేకపోతే ఎలా?
ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం మీ బంగారు నగలపై హాల్‌మార్క్ లేకపోతే వాటిని మీరు అమ్మలేరు. ఎక్స్‌ఛేంజ్ కూడా చేయలేరు. కాబట్టి మీ నగలపై HUID ముద్రించుకోవాల్సిన బాధ్యత మీదే. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీ ఆభరణాలపై ఇప్పటికే పాత హాల్‌మార్క్ ఉన్నట్టైతే మీరు మళ్లీ హాల్‌మార్కింగ్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో HUID లేకపోయినా నడుస్తుంది. కానీ మీ దగ్గర హాల్‌మార్క్ లేకుండా పాత నగలు ఉన్నట్టైతే వాటిపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ముద్ర వేయించాలి.
ఇది కాకుండా, రెండు గ్రాముల లోపు బంగారం, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఉద్దేశించిన ఆభరణాలు, విదేశీ కొనుగోలుదారుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఏదైనా బంగారు వస్తువు, ఫౌంటెన్ పెన్నులు, గడియారాలు, ప్రత్యేక ఆభరణాలను హాల్‌మార్కింగ్ నుంచి మినహాయించారు. రూ.40 లక్షల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న నగల వ్యాపారులకు కూడా మినహాయింపు ఉంది.
మీ నగలపై హాల్‌మార్క్ ఎలా వేయించాలంటే?
మీరు ఏదైనా BIS గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రంలో ఆభరణాలను పరీక్షించుకోవచ్చు. పరీక్షించాల్సిన ఐటెమ్‌ల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఒక్కో వస్తువుకు రూ.45 చెల్లించాలి. ఒకవేళ నాలుగు వస్తువులే ఉంటే ఛార్జీ రూ.200 అవుతుంది. బీఐఎస్‌లో రిజిస్టర్ అయిన నగల వ్యాపారి ద్వారా వారి ఆభరణాలను హాల్‌మార్క్ చేసుకోవచ్చు. ఆభరణాల వ్యాపారి వస్తువును బీఐఎస్ అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి ముద్ర వేయిస్తారు.
ఎలాంటి ప్రభావం ఉంటుంది?
బంగారాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మరింత పారదర్శకంగా, నాణ్యతను మెయింటైన్ చేసేలా కొత్త హాల్‌మార్కింగ్ నియమాలు ఉపయోగపడతాయి. హాల్‌మార్క్ లేని నగలు అమ్మే వ్యాపారులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, బంగారు ఆభరణాల ధర కంటే ఐదు రెట్లు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
0 Comments:
Post a Comment