Diesel Vehicles Ban: కేంద్రం సంచలన నిర్ణయం..డీజిల్ వాహనాలపై నిషేధం?
Diesel Vehicles Ban: డీజిల్‌తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్‌పై(Diesel vehicles) నిషేధం విధించాలని ప్రభుత్వానికి నివేదిక అందింది. దేశంలోని 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో, విపరీత కాలుష్యం కలిగిన పట్టణాల్లో 2027 నాటికి ఈ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం నియమించిన కమిటీ సూచించింది.
పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన మార్గదర్శకాలను రూపొందించాలని ఈ కమిటీని ప్రభుత్వం కోరింది. తాజాగా కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు బహిర్గతం అయ్యాయి.
వాహనాల నుంచి వెలువడే కాలుష్యాలలో ప్రధానంగా డీజిల్ వెహికల్స్‌దే ప్రధాన పాత్ర. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కమిటీ కీలక సూచనలు చేసింది. 2027 నాటికి 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్‌తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్‌ని దశల వారీగా నిషేధించాలనేది ప్రధాన ప్రతిపాదన. వీటి స్థానంలో 50శాతం వాహనాలను ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో, మిగతా వాటిని ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడిచే వాహనాలతో భర్తీ చేయాలని సూచించింది.
* నివేదికలో కీలక విషయాలు
2024 నుంచి డీజిల్‌తో నడిచే సిటీ బస్సులను అనుమతించకూడదని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. 2030లోగా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే సిటీ బస్సులుగా వినియోగించాలని తెలిపింది. అప్పటివరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో వాహనాలను నడిపించాలని సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేంత వరకు సీఎన్‌జీని ఆల్టర్నేటివ్ ఇంధనంగా ఉపయోగించాలని నివేదికలో పేర్కొంది. మరో 10 నుంచి 15 ఏళ్లలోగా సంప్రదాయ ఇంజిన్లతో నడిచే టూ వీలర్స్, త్రీ వీలర్స్‌ని సైతం రోడ్డుపైకి అనుమతించకూడదని చెప్పింది.
పెట్రోల్‌తో నడిచే బైకులు, స్కూటర్లు, ఆటోలను దశలవారీగా తప్పించి వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని వాడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం మొన్నటివరకు అందించిన ఇన్సెంటివ్స్‌ని తిరిగి కొనసాగించాలని పేర్కొంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ స్కీమ్(FAME) కింద ఇచ్చే ఇన్సెంటివ్స్ గడువును పొడిగించాలని సూచించింది. మార్చి 31వరకు ఈ గడువు ఉండేది.
* 'నెట్ జీరో' సాధనే లక్ష్యం
కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా రిలీజ్ చేసే దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. అందుకే దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2070 నాటికి 'నెట్ జీరో' సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు 2030 నాటికి భారత్‌ను కార్బన్ ఎమిషన్ ఫ్రీ దేశంగా మార్చాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆ నాటికి దేశంలో వినియోగించే మొత్తం ఇంధనంలో 50శాతం రెన్యువబుల్(పునరుత్పాదక) ఫ్యూయల్ ఉండేలా డెడ్‌లైన్ పెట్టుకుంది.
అయితే తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నివేదికను కేబినెట్ ఆమోదానికి పంపుతుందా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
0 Comments:
Post a Comment