రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రకరకాల కరెన్సీ నోట్లను ముద్రిస్తూ ఉంటుంది. రూ.10 నుంచి రూ.2,000 వరకు ప్రస్తుతం కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో రూ.2,000 కరెన్సీ నోట్ల (Rs 2000 Notes) ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసింది. మిగతా కరెన్సీ నోట్ల ముద్రణ కొనసాగుతోంది. గరిష్టంగా రూ.10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.
ప్రజలు రోజువారీగా ఉపయోగించే కరెన్సీ నోట్లను ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ గణనీయమైన ఖర్చులను భరిస్తాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చును పెంచుతోంది.
2021 నుంచి కాగితం, ఇంక్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఆర్‌బీఐ ముద్రించే కరెన్సీ నోట్ల ఖర్చు కూడా పెరుగుతోంది. విచిత్రం ఏంటంటే రూ.500 నోట్ల ముద్రణ కన్నా రూ.200 నోట్ల ముద్రణకే ఆర్‌బీఐ ఎక్కువ ఖర్చు చేయడం విశేషం.
రూ.20 నోటు ముద్రణ ఖర్చు కన్నా రూ.10 నోటు ప్రింటింగ్ కాస్ట్ కంటే ఎక్కువ. నోట్లను ముద్రించడం కంటే నాణేల తయారీ వల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. 20 రూపాయల నోట్లు 1000 ముద్రించడం కన్నా, 10 రూపాయల నోట్లు 1000 ముద్రించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్ (BRBNMPL) ముద్రణ సంస్థ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 రూపాయల నోట్లను 1000 ముద్రించడానికి రూ.960 ఖర్చవుతుంది.
అంటే ఒక రూ.10 నోటు ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు 96 పైసలు. ఇక 20 రూపాయల నోట్లను 1000 ముద్రించడానికి రూ.950 ఖర్చవుతుంది.
అంటే ఒక్కో నోటు ధర 95 పైసలు. ఈ లెక్కన 20 రూపాయల 1000 నోట్లతో పోలిస్తే 10 రూపాయల 1000 నోట్లను ముద్రించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐకి 50 రూపాయల నోట్లు 1000 ముద్రించడానికి రూ.1,130 ఖర్చు కాగా, 100 రూపాయల నోట్లు 1,000 ముద్రించడానికి అయ్యే ఖర్చు రూ.1,770. అంటే ఒక రూ.50 నోటు ముద్రించడానికి రూ.1.13 ఖర్చవుతుండగా, ఒక రూ.100 నోటు ముద్రించడానికి రూ.1.77 ఖర్చవుతోంది.
అన్నింటికన్నా రూ.200 నోటు ముద్రించడానికే ఎక్కువ ఖర్చవుతోంది. రూ.200 కరెన్సీ నోట్లను 1000 ముద్రించడానికి అయ్యే ఖర్చు రూ.2,370. అంటే ఒక నోటుకు రూ.2.37 ఖర్చవుతుండగా, రూ.500 కరెన్సీ నోట్లను 1000 ముద్రించడానికి అయ్యే ఖర్చు రూ.2,290. అంటే ఒక నోటుకు రూ.2.29 ఖర్చవుతోంది. ఈ లెక్కన రూ.500 నోటు ముద్రించడం కన్నా రూ.200 నోటు ముద్రించడానికే ఖర్చు ఎక్కువ.
భారతదేశంలో ఉన్న నాలుగు ప్రెస్‌లలో కరెన్సీ నోట్లను ముద్రణ జరుగుతోంది. వీటిలో రెండు ఆర్‌బీఐకి చెందినవి కాగా, మిగిలిన రెండు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి.
ఆర్‌బీఐ ప్రెస్‌లు మైసూర్, సల్బోనిలలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రెస్‌లు నాసిక్, దేవాస్‌లో ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద డినామినేషన్ నోటు రూ.2,000. అయితే ప్రస్తుతం రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ ముద్రించట్లేదు.
0 Comments:
Post a Comment