Chicken Price : ఏపీలో కొండెక్కిన చికెన్ ధరలు, సామాన్యుడికి చికెన్ ముక్క కూడా భారమే!
Chicken Price: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. ఏపీలో చికెన్ ధర సుమారు రూ.280 నుంచి రూ.285కు చేరింది. తెలంగాణలో కూడా రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కోళ్ల పెంపకంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నాయి. చికెన్ ధరలు పెరగడంతో సామాన్యుడిపై భారంపడుతోంది. ముఖ్యంగా ఏపీలో కోడి మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో ఒక్కసారిగా కోడి మాంసం ధరలు పెరిగిపోయాయి. చికెన్ ప్రియులు ఈ ధరలు చూసి షాక్ అవుతున్నారు. చికెన్ ముక్క తినాలన్నా జేబుకు చిల్లు తప్పడంలేదంటున్నారు. సహజంగా వేసవిలో కోడి మాంసం రేట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో కోడి మాంసం ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ధరలపై ప్రభావం చూపుతోంది.
రూ.300 చేరువలో చికెన్ ధరలు
మార్కెట్లోకి కోళ్లు తక్కువగా వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో బాయిలర్ కోడి మాంసం రూ.200 నుంచి రూ.210 వరకు ధర పలికింది. ఫారమ్ కోడి మాంసం ధర రూ.150 నుంచి రూ.170 వరకు ఉండేది. అలాంటిది ఈ వారం బాయిలర్ మాంసం కిలో ధర రూ.280 నుంచి రూ.285 పలుకుతుంది. ఫారమ్ కోడి కిలో మాంసం రూ.200 పైగా పలుకుతోంది. సమ్మర్ సీజన్ లో కోళ్ల ఉత్పత్తిగా తక్కువగా ఉంటుంది. ఏపీలోని పలు జిల్లాల్లో కిలో నుంచి కిలోంపావు కోళ్లు మాత్రమే మార్కెట్‌లోకి వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు.
కోడి గుడ్డు ధర కూడా
హైదరాబాద్, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కోళ్లను వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుంటారు. కోడి మాంసంతో పాటు మార్కెట్ లో కోడి గుడ్డు ధర పెరుగుతోంది. వారం క్రితం రూ.4 లోపు పలికిన గుడ్డు ధర ఈ వారం రూ.5కు చేరింది. వారం క్రితం అట్ట కోడి గుడ్ల ధర రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.150కు చేరింది. చికెన్, ఎగ్స్ ధరలు మండిపోతున్నాయని మాంసం ప్రియులు అంటున్నారు.
తెలంగాణలో ధరలు
తెలంగాణలో ప్రస్తుతం చికెన్ ధరలు నార్మల్ గా ఉన్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. కిలో బాయిలర్ మాంసం ధర రూ.200 ఉందని తెలిపారు. అయితే వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గుతోందంటున్నారు. దీంతో చికెన్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. వేసవికాలంలో చికెన్ ధరలలో హెచ్చుతగ్గులు సామాన్యమే అని కోళ్ల ఫారమ్ నిర్వాహకులు అంటున్నారు.
0 Comments:
Post a Comment