తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం టికెట్లు: కౌంటర్లు ఇవే..
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శన చేసుకోవచ్చు.
సోమవారం 65,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 29,290 మంది తలనీలాలను సమర్పించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3.57 కోట్ల రూపాయల ఆదాయం అందింది.
శ్రీవారిని దర్శించుకోవడానికి అవసరమైన 300 రూపాయల టికెట్లను టీటీడీ అధికారులు కిందటి నెల 25వ తేదీ నాడే ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే నెలలో ఆర్జిత సేవా టికెట్లనూ జారీ చేశారు. వసతి గదుల కోటాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మే, జూన్ నెలల కోసం విడుదల చేసిన ఆయా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
మే జూన్ నెలలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లన్నీ బుక్ అయ్యాయి. తిరుమల వసతి గదులు కూడా భర్తీ అయ్యాయి. జులై నెలకు సంబంధించిన టికెట్లు, వసతి గదుల కోటాను ఈ నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ టికెట్లను పొందలేని భక్తుల కోసం టీటీడీ అధికారులు ఉచిత దర్శన అవకాశాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఉచిత దర్శనం టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
ఈ టికెట్లు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు జారీ చేస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వేస్టేషన్ వెనక ఉండే గోవింద రాజుల సత్రాలు, సెంట్రల్ బస్ స్టేషన్ సమీపంలో ఉండే శ్రీనివాసంలల్లో ఈ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా దర్శనం టికెట్లను మంజూరు చేస్తోన్నారు టీటీడీ అధికారులు.
అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్లే వారు భూదేవి కాంప్లెక్స్ ఆ టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ కౌంటర్లు పని చేస్తాయి. శ్రీవారి మెట్లమార్గంలో వెళ్లేవారికి దారి మధ్యలో ఈ టికెట్లను జారీ చేస్తారు. తెల్లవారు జామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ టికెట్లను తీసుకోవచ్చు.
వసతి గదులు లేని భక్తులు తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయం వద్ద ఆ టికెట్లను పొందవచ్చు. గదుల ఖాళీల ఆధారంగా వాటిని భక్తులకు కేటాయిస్తారు. 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు ఆన్‌లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు.
ఏడాది లోపు వయస్సు ఉన్న చిన్నారులు ఉన్న తల్లిదండ్రులకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం పిల్లల బర్త్ సర్టిఫికెట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తమవెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారికి దర్శనాన్ని కల్పిస్తోన్నారు టీటీడీ అధికారులు.
0 Comments:
Post a Comment