ఏపీలో భారీ వర్షాలు: ఈ జిల్లాల్లో- అలర్ట్ చేసిన ఐఎండీ
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి.
ఇదే తీవ్రత మరో 48 గంటలపాటు ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీతో పాటు తెలంగాణ మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
దక్షిణ బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం రాత్రి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారుతుందని, మరింత విస్తరిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాయలసీమలో విస్తరించిన విండ్ కన్వర్జెన్స్ జోన్ వల్ల రాయలసీమలో వర్షాలు పడ్డాయి. అనంతపురం, కర్నూలు, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి. రాయలసీమకు ఆనుకుని ఉన్న కర్ణాటక సరిహద్దు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇవ్వాళ ఏపీ తీర ప్రాంత జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరులో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మోఖా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ తుఫాన్ ముప్పు తప్పింది. మయన్మార్ వైపు మళ్లింది. ఈ నెల 14వ తేదీ నాటికి అది బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరాన్ని తాకుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
దీని ప్రభావంతో- అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మత్స్యకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపు వెళ్లకూడదని, ఇప్పటికే అక్కడ చేపల వేటలో ఉన్న వారు తీరానికి చేరుకోవాలని ఆయన సూచించారు. తుఫాన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
0 Comments:
Post a Comment