పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు: మోడీ చేతుల మీదుగా ఎప్పుడంటే?
దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా(Central Vista) ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ అద్భుత కట్టడం జాతికి అంకితం కానుంది. ఈ మేరకు వివరాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆకాంక్షించింది లోక్‌సభ సెక్రటేరియట్. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించినట్లు తెలిపింది. అంతేగాక, లోక్‌సభ, రాజ్యసభలోనూ మార్షల్స్‌కు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిర్ణయించినట్లు పేర్కొంది.
కాగా, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్ మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల స్థలంలో కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. సెంట్రల్ సెక్రెటేరియట్, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్కేవ్లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు పూర్తికావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది.
64,500 చదరపు మీటర్ల పరిధిలో నూతన పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు కూడా పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.
అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. పుష్ప అలంకరణ సహా ఇతర డెకరేషన్ పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు సైతం పిలిచినట్లు వివరించాయి. 'పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తైంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు' అని అధికార వర్గాలు తెలిపాయి.
ఒకవైపు అదానీ కేసులో జేపీసీ డిమాండ్‌పై ప్రతిపక్షం మొండిగా వ్యవహరిస్తుండగా, మరోవైపు రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణపై అధికార పక్షం కూడా మొండిగా వ్యవహరించడం వల్లనే గత పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి గురయ్యాయి. రాహుల్ గాంధీ చేసిన తప్పుడు ప్రకటనలు, కానీ రాహుల్ గాంధీ క్షమాపణ కోరినప్పుడు, నేను సావర్కర్‌ను కాను, నేను గాంధీని అని చెప్పి రాహుల్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన ఈ ప్రకటనపై పెద్ద దుమారమే రేగింది. బీజేపీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన కూడా అసౌకర్యంగా భావించింది.
అయితే అదే సమయంలో చాలా మంది బీజేపీ నేతలు రాహుల్ గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరని కౌంటర్ ఎటాక్ చేశారు. సావర్కర్‌గా మారాలంటే అన్నింటినీ అంకితం చేయాలని వ్యాఖ్యానించారు. తాజాగా ప్రధాని మోదీ కూడా దీనిపై తనదైన శైలిలో రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మే 28న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనుండటం.. అదే రోజు స్వాతంత్ర్యవీర్ వీర్ సావర్కర్ జయంతి కావడం ఇక్కడ చెప్పకోవాల్సిన విషయం.
వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం మొత్తం దేశానికి జాతీయవాద సందేశాన్ని అందించడమే కాకుండా రాహుల్ గాంధీతో సహా మొత్తం ప్రతిపక్షానికి ప్రధాని మోదీ చేసిన పెద్ద ఎదురుదాడి అవుతుంది. గత ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ వీర్ సావర్కర్‌ను దృఢత్వం, త్యాగం యొక్క చిహ్నంగా అభివర్ణించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మహారాష్ట్ర పర్యటన సందర్భంగా వీర్ సావర్కర్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను కలిశారు.
0 Comments:
Post a Comment