ఏపీ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కీలక మార్పు - ఇకపై ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఇలా..
ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంలో ప్రభుత్వం మరో కీలక మార్పు చేసింది. ఇప్పటికే ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం..
ఇప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో తాజాగా తీసుకొచ్చిన పథకంలోనూ మార్పులు చేస్తోంది. తద్వారా ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మార్పుకు సంబంధించిన వివరాలు ఓసారి చూద్దాం..
ఏపీలో వైసీపీ సర్కార్ ఆస్తుల్ని ఎక్కడైనా రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో ఓ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా తమ ఆస్తులు ఎక్కడున్నా సరే తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించారు. అయితే ఇందులో భాగంగా సదరు ఆస్తుల పత్రాలను వినియోగదారులు తాము దరఖాస్తు చేసుకున్న ప్రాంతం నుంచి స్ధానిక రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పంపి పరిశీలించి ఆమోద ముద్ర వేసేవారు. దీంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.
విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం ఇప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు మరో కీలక మార్పు చేసింది. ఇందులో భాగంగా ఎనీవేర్ కింద వచ్చిన దరఖాస్తుల్ని సదరు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి ఉన్న ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఆస్తిగా ఆన్ లైన్లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి నుంచే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో భాగంగా ఎక్కడో ఉన్న ఆస్తికి ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మనం దరఖాస్తు చేసుకుంటే సదరు ఆస్తిని పరిశీలించేందుకు అక్కడి సబ్ రిజిస్ట్రార్ కు పంపుతున్నారు. ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కూ, అక్కడి సబ్ రిజిస్ట్రార్ కు మధ్య విభేధాలు ఉంటే ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. అలాగే సిబ్బంది, పనిభారం వంటి అంశాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం తాజా మార్పు చేసినట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment