శ్రీవారి దర్శనంలో వెండి వాకిలి వద్ద భక్తుల కోసం - ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!
వేసవిలో తిరుమల రద్దీ పెరుగుతోంది. జూన్ 15 వరకు రద్దీ కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే దర్శనం..వసతి..సేవా టికెట్లు పూర్తయ్యాయి. కాలి నడకన వస్తున్న భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు అందిస్తున్నారు. సెలవులు ప్రారంభం కావటం మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేసారు. సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడంపై అధికారులక మార్గనిర్దేశం చేసారు.
తిరుమలలో వేసవి రద్దీ: ఈ రోజు నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. తిరుమలలో రద్దీ మొదలైంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని ఆయా విభాగాధిపతులను ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో శనివారం టిటిడి సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 1 నుండి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తిరుమలకు జూలై 15వ తేదీ వరకు డిప్యూటేషన్‌పై వచ్చే సంబంధిత అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
టీటీడీ ఏర్పాట్లు: క్యూ లైన్లు, వైకుంఠం కాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లలో తాగు నీరు, అన్నప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత విభాగాధిపతులను ఈఓ సూచించారు. విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ, సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. భక్తుల రద్దీకి తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవాలన్నారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే అన్ని కీలక ప్రదేశాల్లో భక్తులకు సేవలు అందించేందుకు తగిన సంఖ్యలో శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వెండివాకిలి తర్వాత ఇబ్బందులు లేకుండా : దర్శనానికి వచ్చే భక్తులకు వెండి వాకిలి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడంపై చర్చించారు. టీటీడీ విశ్రాంత సీఈ, టీటీడీ సలహాదారు రామ చంద్రారెడ్డి, రద్దీ నిర్వహణలో అపారమైన పరిజ్ఞానం, అనుభవం ఉన్న శ్రీవారి ఆలయ విశ్రాంత డిప్యూటీ ఈఓ ప్రభాకర్‌రెడ్డి కలిసి ఈ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళికను రెండ్రోజుల్లో అందించాలని ఈవో కోరారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఈఓ ఆదేశించారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించాలని తిరుమల పోలీసులకు ఈవో సూచనలు చేసారు. భక్తులకు అన్నప్రసాదం, నీరు, లడ్డూ ప్రసాదాలు సక్రమంగా అందేలా నిరంతర పరిశీలన ఉండాలన్నారు.
0 Comments:
Post a Comment