బైడెన్ నివాసంపై దాడికి కుట్ర పన్నిన కందుల సాయి వర్షిత్..ట్రక్కుతో వైట్‌హౌస్ వద్ద బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలో తెలుగు కుర్రాడు.. కందుల సాయి వర్షిత్ అరెస్ట్ అయ్యాడు. వాషింగ్టన్ డీసీ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్‌హౌస్‌లోకి ఓ భారీ ట్రక్కుతో బీభత్సం సృష్టించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. నాజీల పతాకాన్ని ఆ ట్రక్కుపై అతికించినట్లు పోలీసులు గుర్తించారు.
కందుల సాయి వర్షిత్ వయస్సు 19 సంవత్సరాలు. మిస్సోరీలోని ఛెస్టర్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటోన్నాడు. గ్రేటర్ సెయింట్ లూయిస్ ప్రాంతంలోని రాక్‌వుడ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఛెస్టర్‌ఫీల్డ్‌లోని మార్క్వెట్ సీనియర్ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:40 నిమిషాల సమయంలో ఓ భారీ ట్రక్కులో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
వైట్ హౌస్ నార్త్-వెస్ట్ గేట్ గుండా లోనికి ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. లఫాయెట్టె పార్క్, హెచ్ స్ట్రీట్ బ్లాక్ నంబర్ 1600 వైపు నుంచి నార్త్-వెస్ట్ గేట్ వైపు భారీ ట్రక్కుతో దూసుకొచ్చాడు. యూ-హాల్ అనే రెంటల్ కంపెనీకి చెందిన ట్రక్ అది. అరిజోనాలోని ఫీనిక్స్ ప్రధాన కేంద్రంగా అమెరికా వ్యాప్తంగా మూవర్స్ అండ్ స్టోరేజ్ సర్వీసులను అందించే సంస్థ యూ-హాల్.
ఈ కంపెనీకి చెందిన ట్రక్కుతో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అతివేగంతో నార్త్-వెస్ట్ గేట్ వైపు దూసుకొచ్చిన కందుల సాయి వర్షిత్ నేరుగా అక్కడి సెక్యూరిటీ బ్యారియర్లను ఢీ కొట్టాడు. వాటిని ఛేదించి లోనికి వెళ్లబోయాడు. ఈ క్రమంలో రెండుసార్లు సెక్యూరిటీ బ్యారియర్లను ట్రక్కుతో ఢీ కొట్టాడు. సెక్యూరిటీని దాటుకుని, అక్కడ ఉన్న బ్యారికేడ్లు, బ్యారియర్లను ధ్వంసం చేసి లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
దీన్ని గమనించిన భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే అతణ్ని అరెస్ట్ చేశారు. యూఎస్ పార్క్ పోలీసులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీ సుపీరియర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో కందుల సాయి వర్షిత్‌కు చెందిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఉద్దేశపూరకంగా వైట్ హౌస్‌లోకి చొరబడే ప్రయత్నం చేసినట్లు కందుల తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లేదా వారి కుటుంబ సభ్యులపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే అతను వైట్ హౌస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ ట్వీట్ చేశారు. ఆ ట్రక్కులో మారణాయుధాలు గానీ, మందుగుండు సామగ్రి గానీ ఇతర పేలుడు పదార్థాలు లేవని పేర్కొన్నారు. అతని వద్ద మిస్సోరి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఆరు నెలల పాటు ప్లాన్ వేసినట్లు వివరించారు.
0 Comments:
Post a Comment