అమరావతిపై కేంద్రానికి జగన్ సర్కార్ కీలక విజ్ఞప్తి..!
ఏపీ లో ప్రస్తుతం అమరావతి కేంద్రంగా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కార్ ఇక్కడి ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయించడం, వాటిపై స్ధానిక రైతుల అభ్యంతరాలతో విపక్షాలు కూడా జట్టు కట్టడంతో రచ్చ సాగుతోంది.
ఈ క్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తమ తుది తీర్పులకు లోబడి ఇక్కడ ఇళ్ల స్ధలాలు ఇవ్వొచ్చని తేల్చేశాయి. దీంతో ప్రభుత్వం ఇవాళ మరింత స్పీడు పెంచింది.
అమరావతిలోని ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయించే విషయంలో ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో వారు కూడా ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి స్ధలాల్ని దాదాపు రూ.20 కోట్లు పెట్టి చదును చేసే పనిలో ఉన్నారు. అలాగే పట్టాల పంపీణీ రోజే మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి ఆర్-5 జోన్‍లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన రోజే ఇళ్ల నిర్మాణానికి కూడా శంఖుస్ధాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్-5 జోన్‍లో మొత్తం 47,017 ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఆర్-5 జోన్‍లో 51,392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
వీటిలో ఇళ్లు కట్టుకోగలిగే వారి కోసం స్ధలాలు కేటాయించి, మిగతా వాటిలో తామే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సహకరించాలనికేంద్రాన్ని కోరింది. సీఆర్డీఏ పరిధిలో షీర్‍వాల్ టెక్నాలజీతో ఇళ్లు కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినప్పుడే మంజూరు పత్రాలూ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించిన సీఆర్డీఏ.. లేఅవుట్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.20 కోట్లు ఖర్చు చేసింది.
0 Comments:
Post a Comment