రూ.500 నోట్లు రద్దవుతాయా? రిజర్వ్ బ్యాంక్ ప్లాన్ అదేనా?
మన దేశంలో చాలా మందికి ఒక అభిప్రాయం ఉంది.
పెద్ద నోట్లు రద్దు చేసేస్తే... అక్రమార్కులు కూడబెట్టిన నల్లధనం అంతా బయటకు వచ్చేస్తుంది అని. ఇది నిజం కాదు. ఇది రుజువు అయ్యింది కూడా. ఇదివరకు పెద్ద నోట్లను రద్దు చేశాక.. ఇండియాలో నల్లధనం కూడబెట్టారని ఎవర్నీ అరెస్టు చెయ్యలేదు. మరి ఆ నల్లధనం ఏమైంది? రకరకాల మార్గాల్లో అది వైట్ మనీ అయిపోయింది. అందువల్ల కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. తద్వారా నోట్లను రద్దు చేస్తే.. నల్లధన అక్రమార్కులకు చెక్ పెట్టినట్లు అవుతుంది అనే ఫార్ములా ఇండియాలో వర్కవుట్ కావట్లేదని అర్థమవుతోంది.
తాజాగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI)... రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో... నల్లధన అక్రమార్కులకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంది అని కొందరు అనుకుంటున్నారు. ఇదే విధంగా... త్వరలోనే రూ.500 నోట్లను కూడా రద్దు చేసేస్తుంది అని అనుకుంటున్నారు.
నిజానికి నల్లధనానికి చెక్ పెట్టేందుకు రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని RBI చెప్పలేదు. ఆ నోట్లతో అవసరం తీరిపోయింది కాబట్టే వెనక్కి తీసుకుంటున్నామని తెలిపింది. కానీ రూ.500 నోట్లతో అవసరం తీరిపోయే ఛాన్సే లేదు. పైగా... ఇకపై వాటితో అవసరం మరింత పెరుగుతుంది. అందువల్ల వాటిని రద్దు చేసే అవకాశమే ఉండదు అన్నది విశ్లేషకుల మాట.
నల్లధనానికి చెక్ పెట్టాలంటే రూ.500 నోట్లను రద్దు చెయ్యాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వారు అంటున్నారు. కానీ.. అలా రద్దు చేసినంత మాత్రాన నల్లధనానికి బ్రేక్ పడదని ఆల్రెడీ రుజువు అయ్యింది కాబట్టి... కేంద్రం మరోసారి అలాంటి పొరపాటు చేస్తుందని అనుకోలేం. సో... రూ.500 నోట్ల జోలికి RBI వెళ్లదని అనుకోవచ్చు.
ఇండియాలో రూ.500 నోట్ల వాడకం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల విలువ 73.3 శాతం ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగినా... గూగుల్ పే, ఫోన్ పే వంటివి చాలా వచ్చినా.. ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలు కరెన్సీని వాడుతున్నారు. అందువల్ల రూ.500 నోటును రద్దు చేస్తే.. అది భారత ఆర్థిక వ్యవస్థకు నెగెటిఫ్ ఫలితాలు ఇవ్వగలదు. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించి.. నష్టం జరగగలదు.
ప్రస్తుతం రూ.2వేల నోట్ల వాడకం ఆగిపోయింది. సాధారణ ప్రజలకు అవి అందుబాటులో లేవు. అందువల్ల వాటిని ఉపసంహరించుకున్నా... ప్రజలకు ఏ సమస్యా రాదు. అదే విధంగా.. రూ.500 నోట్లను కూడా ప్రజలు వాడటం మానేసిన రోజున RBI వాటిని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పట్లో ప్రజలు వాటిని వదిలేసే అవకాశం లేదు. అందువల్ల రూ.500 నోట్లు రద్దయ్యే పరిస్థితి ఉండదు అంటున్నారు ఆర్థిక నిపుణులు.
0 Comments:
Post a Comment