అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..
కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
రాజోలు మండలం తాటిపాకలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఏలూరు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం పడింది. నెల్లూరు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది.
ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాల పైన కీలక అప్డేట్ వచ్చేసింది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు భారీ ఉష్ణోగ్రతలు..మరో వైపు గాలివాన..వర్షాలతో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు కొనసాగుతున్నాయి. జూన్ ప్రారంభం అవుతున్న వేళ రుతుపవనాల కోసం నిరీక్షణ పెరిగింది. ఈ సమయంలోనే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాల రాకపై ప్రకటన చేసింది.
రుతుపవనాల రాక:రుతుపవనాలు సాధారణంగా జూన ఐదో తేదీ నాటికి రాయలసీమ, పదో తేదీ నాటికి ఉత్తర కోస్తాలో ప్రవేశించాలి. అయితే అరేబియా సముద్రంలో జూన 5న ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీని కారణంగా నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలోకి మూడు, నాలుగు రోజులు అలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జూన్ 8,9 తేదీల్లో సీమలో ప్రవేశం:జూన 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయవ్య దిశగా పయనించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కేరళకు రుతుపవనాలు రాకకు ఇబ్బంది లేకపోయినా పురోగతిలో మందకొడితనం కనిపించే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేరళ పరిసరాల్లో వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడంతో జూన్ రెండు, మూడు తేదీల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశముందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అల్పపీడనం బలపడి తుఫానగా మారితే రుతుపవనాల విస్తరణపై ప్రభావం చూపనుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న తరువాత జూన్ 8, 9వ తేదీల్లో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
రెండు రోజుల పాటు వర్షాలు:అనుకూలించకుంటే జూన్ 10,12 తేదీల్లో రావచ్చని మరో విశ్లేషణ. దీనికి అనుగుణంగా రైతులు తొలకరి సాగు ప్రారంభించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత పెరిగి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.
0 Comments:
Post a Comment