Wipro: విప్రో కంపెనీలో ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యం..మరో టెస్ట్ క్లియర్ చేస్తేనే జాబ్!
Wipro: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో టెక్ కంపెనీలు(Tech companies) కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించడంతో పాటు ఫ్రెషర్స్‌ను(Freshers) ఆన్‌బోర్డ్‌లోకి చేర్చుకోవడాన్ని ఆలస్యం చేస్తున్నాయి.
దేశీయ టెక్ దిగ్గజం విప్రో(Wipro) కూడా ఇదే బాటలో నడుస్తోంది. 15 నెలలకు పైగా ఆన్‌బోర్డింగ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్స్‌ను ఫిల్టర్ చేయడానికి కంపెనీ ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (PRP) అనే కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్‌కు ఓ టెస్ట్ నిర్వహిస్తారు. కనీసం 60 శాతం స్కోర్ చేయలేనివారిని టర్మినేట్ చేస్తారు.
మరో ఐటీ సంస్థ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ట్రైనింగ్ సమయంలో ఫ్రెషర్స్ కోసం టెస్ట్ నిర్వహించి, ఉత్తీర్ణత సాధించని వారిని తొలగిస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఎల్‌టీఐమైండ్‌ట్రీ గతేడాది దాదాపు 600 నుంచి 700 మంది ఫ్రెఫర్స్‌కు ఆఫర్ లెటర్స్ జారీ చేసింది. అయితే ఇప్పటివరకు వారిని ఆన్‌బోర్డ్‌లోకి తీసుకోలేదు. ఫ్రెషర్స్ జాబ్‌లో చేరడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పేరుతో ఓ అర్హత పరీక్షను కంపెనీ నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌లో ఫ్రెషర్స్ కచ్చితంగా పాల్గొనాలని, లేకపోతే ఆఫర్ లేటర్స్ ఆటోమెటిక్‌గా రద్దు అవుతాయని పేర్కొంది.
* ఐటీ కంపెనీల చర్యలు అనైతికం
ఫ్రెషర్స్ విషయంలో విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ తీసుకున్న ఈ చర్యలపై ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా స్పందించారు. విప్రో ఫ్రెషర్స్ వేతనాలను ఫిబ్రవరిలో రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిందన్నారు. ఇప్పటికే ఫ్రెషర్స్ జీతాలను సైతం విప్రో ఫిబ్రవరిలో భారీగా తగ్గించడం గమనార్హం.
హర్‌ప్రీత్ మాట్లాడుతూ.. 'ఆన్‌బోర్డింగ్‌కు ముందే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో టెస్ట్ నిర్వహణపై ఫ్రెషర్స్ అసంతృప్తిగా ఉన్నారు. వారిని టెస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఎందుకు నియమించుకున్నారు. విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ తీసుకున్న చర్యలు పూర్తిగా అనైతికం, అన్యాయంగా ఉన్నాయి.' అని మండిపడ్డారు.
* ఓవర్ హైరింగ్ కారణంగా ఆలస్యం
మహమ్మారి కరోనా సమయంలో డిజిటలైజేషన్ డిమాండ్ పెరగడంతో ఐటీ కంపెనీలు ఓవర్ హైరింగ్ చేపట్టాయి. ప్రస్తుతం డిమాండ్ తగ్గిపోవడం, మరోపక్క ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో లేఆఫ్స్‌కు తెరలేపాయి. దీంతో పాటు ఫ్రెషర్స్‌ను ఆన్‌బోర్డ్‌లోకి తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో హైరింగ్ పూర్తిగా తగ్గిపోవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
0 Comments:
Post a Comment