ఉద్యోగం లేక పిచ్చివాడినయ్యా..
1998లో ఉపాధ్యాయ పరీక్షలో ఉత్తీర్ణత అయ్యి, అర్హత సాధించిన వారిలో అల్లక కేదారేశ్వరరావు ఒకరు. కొన్ని ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాటం చేసి అలసిపోయాడు.
ఉద్యోగం కోసం ఎదురుచూసి చూసి... విసిగిపోయాడు. వేరే ఉద్యోగంలో ఇమడలేకపోయాడు. ఉద్యోగం రాలేదన్న బాధలో నిరాశ, నిస్పృహతో మానసికంగా కుంగిపోయాడు. ఉపాధి లేక పేదరికంతో తల్లిని కోల్పోయాడు. చెల్లిని చూసుకోలేకపోయాడు. ఎన్నో అవమానాలు, హేళనలు భరించాడు. ఇక ఎప్పటికీ టీచర్‌గా తనని తాను చూసుకోలేను అనుకున్నాడు. కానీ ఇన్నాళ్లకు తన కల నెరవేరడంతో కేదారేశ్వరరావు ఆనందానికి అవధులు లేవు. ఈ భావోద్వేగాన్ని తన మాటల్లో...
'మాది శ్రీకాకుళం జిల్లా , పాతపట్నం మండలం సీధీ గ్రామం. నాన్న నా చిన్నతనంలో చనిపోయాడు. దాంతో అమ్మ కుటుంబ బాధ్యతలు తీసుకుంది. పేద కుటుంబం. ఆస్తులు ఏమీ లేవు. చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుం దని అమ్మ అనుకుంది. చదువులో నా మార్కులు చూసి అమ్మ చాలా సంతోషించేది. అప్పు చేసి మరీ మా ఖర్చులు భరించింది. 1992లో అన్నామలై విశ్వవిద్యాలయంలో బిఈడి పూర్తి చేశా. టీచర్ ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో రాత్రింబవళ్లు కష్టపడ్డా. 1998లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. ఇంటర్వ్యూ కూడా పూర్తి చేశా. ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశగా ఎదురుచూశా. కాని అప్పటి ప్రభుత్వం పోస్టులను కుదించేసి, తక్కువ సంఖ్యలో భర్తీ చేసింది. ఆవేదన చెందా. నాలాగే ఎంతో మంది అభ్యర్థులు న్యాయపోరాటానికి దిగారు. నేనూ వాళ్లతో పాటు పోరాటంలో పాల్గొన్నా. అధికారులు చుట్టూ తిరిగి, తిరిగి విసిగిపోయా.
అమ్మ మరణం..
సంవత్సరాలు గడిచే కొద్ది ఇల్లు గడవడం కష్టం అయ్యింది. ఏదైనా ప్రయివేటు స్కూల్లో చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో హైదరాబాద్‌కు వెళ్లా. అక్కడ అన్నీ కొనుక్కోవడమే. దాంతో తిండి లేక మంచినీళ్లు తాగి గడిపిన రోజులే ఎక్కువ. ఓ బట్టల దుకాణంలో పనికి కుదిరా. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాడు ఇలా పని చేస్తున్నాడంటూ చాలా మంది నవ్వుకునేవారు. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించేవి. అప్పు చేసి చెల్లికి పెళ్లి చేసి పంపించాం. కాని ఆమెకు పుట్టినింటి నుంచి జరిగే లాంఛనాలు ఏమీ చేయలేకపోయాం. నా నిరుద్యోగం మరింత పేదరికంలోకి నెట్టింది. అమ్మ పని చేసి చేసి అనారోగ్యానికి గురైంది. ఆమెకు సరైన వైద్యం, ఆహారం అందించలేకపోయా. బంధువులు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎవరైనా అప్పు ఇచ్చినా...తిరిగి తీర్చలేని స్థితిలో నేను ఉన్నానని అందరికీ అర్థమయ్యింది. అమ్మ చనిపోవడంతో మానసికంగా కుంగిపోయా. ఒంటరివాడినయ్యా. అందరూ పెళ్లి చేసుకోమని చెప్పారు. కానీ ఉద్యోగం లేకుండా భార్యను ఎలా పోషించాలి. అందుకే చేసుకోలేదు.
ఎందుకింత జాప్యం ?
తిరిగి ఊరికి వచ్చా. జీవనం కోసం ఊరూరా తిరిగి సైకిల్ మీద బట్టలు అమ్మాను. ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. అంత డబ్బు లేక వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఒక్కోరోజు ఖాళీ కడుపుతోనే పడుకునే వాడిని. నా దుస్థితి చూసి ఊరిలో జనం అన్నం పెట్టేవారు. సంవత్సరాలు గడిచేకొద్ది నా పరిస్థితి మరింత దిగజారి పోయింది. ఇల్లు పాతది కావడంతో గోడలు పడిపోయాయి. కప్పు కూలిపోయింది. డబ్బులేక బాగుచేయించలేదు. ఎప్పుటికైనా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వస్తుందని ఎదురుచూశా. మా ఊరికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకులను అర్ధించా. అధికారులనూ కలిసి అడిగా. ఏం లాభం లేకపోయింది. నా అవతరం చూసి 'ఉద్యోగం రాకపోవడంతో పిచ్చివాడు అయ్యాడు' అనుకునేవారు. కోర్టులో ఇన్ని సంవత్సరాలు కేసు నడుస్తోంది. ఫలితం ఉంటుందా? ఉండదా? ఉద్యోగం వస్తుందా? అనే ఆలోచనలు నన్ను వదిలేవి కావు. ఎక్కడికెళ్లినా ఉద్యోగం లేదని చిన్నచూపు చూసేవారు. అవమానాలు పడ్డా. ఎందుకు బతుకుతున్నానో అర్థమయ్యేది కాదు. పెరిగిన జుట్టు, గడ్డం, చినిగిన బట్టలు చూసి జనం జాలి చూపేవారు. ఎంతో మానసిక క్షోభ అనుభవించా. చివరకు 57 ఏళ్ల వయసులో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఈ విషయం కూడా ఊరి జనం చెప్పారు. నాకు క్షవరం చేయించి, కొత్తబట్టలు కుట్టించి ఇచ్చారు. కేక్ కట్ చేయించి సంబరాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది.'
కేదారేశ్వరరావు జీవితమే కాదు... ఇటువంటి ఎంతో మంది నిరుద్యోగులకు సకాలంలో ఉద్యోగాలు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
0 Comments:
Post a Comment