తమకు అబ్బాయి పుట్టాలని కోరుకుంటే అమ్మాయి పుట్టడం.. ఆడపిల్ల కావాలనుకుంటే మగపిల్లాడు పుట్టడం..
ఇలా చాలామంది విషయంలో జరుగుతుంటుంది. అంతేకాదు.. తమకు సంతానం కలగకపోయినా పర్లేదు.. కానీ పుడితే మగపిల్లాడే పుట్టాలని కోరుకునే వారూ లేకపోలేదు. అలాంటిది అమెరికాకు చెందిన ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టుక కోసం ఏళ్లు, దశాబ్దాలు కాదు.. ఏకంగా శతాబ్దానికి పైగానే ఎదురుచూసింది.
ఆ వంశంలో అమ్మాయి పుట్టక ఇప్పటికి 138 ఏళ్లు గడిచింది. తమ నట్టింట ఆడపిల్ల అడుగులు వేయాలని ఎంతో ఆశతో ఎదురు చూసీ చూసీ అలసిపోయిన ఆ వంశంలో ఎవరు గర్భం దాల్చినా.. 'ఈసారీ మగపిల్లాడే పుడతాడు..!' అన్న ఒక రకమైన అసహనం నెలకొంది.
కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పాప పుట్టే సరికి.. ఇటు ఈ చిన్నారి తల్లిదండ్రులకు, అటు ఈ వంశానికి చెందిన ఇతర కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా తన రాకతో ఆ కుటుంబంలో తరగని ఆనందాలు నింపిన ఈ బుజ్జాయి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జూనియర్ సెలబ్రిటీగా మారిపోయింది. మరి, ఈ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..
కరోలిన్-అండ్రూ క్లార్క్.. మిచిగాన్‌లోని కలెడోనియాలో నివసిస్తోందీ జంట. అయితే ఆండ్రూ వంశంలో ఆడపిల్లలు పుట్టక ఇప్పటికి సరిగ్గా 138 ఏళ్లు గడిచింది. 1885లో పాప పుట్టిందంటే.. ఇక ఆ తర్వాత వరుసగా అందరూ అబ్బాయిలే పుట్టారు. దీంతో తమకు అమ్మాయి పుట్టాలని ప్రతి తరం కోరుకోవడం, అందరూ మగపిల్లలే పుట్టడంతో.. ఆడపిల్లపై ఆశల్ని వదిలేసుకుందీ వంశం.
ఇలాంటి తరుణంలో ఆడపిల్లకు జన్మనిచ్చిన కరోలిన్.. సుదీర్ఘ విరామం తర్వాత తన వంశానికి పాపను అందించి.. తన భర్తను, ఆ కుటుంబాన్ని చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తింది.
గర్భస్రావం కావడంతో..!
అయితే ఈ జంటకు తొలుచూరుగా మగపిల్లాడు పుట్టాడు. ఇక రెండో సంతానం కోసం 2020లో గర్భం దాల్చిన కరోలిన్‌కు.. 2021 జనవరిలో అబార్షన్ అయింది. ఆపై మరోసారి కూడా గర్భస్రావమైంది. దీంతో తీవ్ర మానసిక వేదనకు లోనైన ఆమె.. మళ్లీ గతేడాది గర్భం దాల్చింది. ఇక ఈసారి అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుడతాడా? అన్న ఆలోచనలు మాని.. తన ఆరోగ్యం పైనే పూర్తి దృష్టి పెట్టింది.. తనకు ఆరోగ్యకరమైన బిడ్డ పుడితే చాలనుకుంది. కానీ తన కోరికతో పాటు తన వంశం 138 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది కరోలిన్.
'మా పెళ్లై పదేళ్లైంది. డేటింగ్‌లో ఉన్నప్పుడు ఆండ్రూ నాకీ విషయం చెప్పాడు. తన బంధువులు, కజిన్స్‌కు ఆడపిల్లలు పుట్టినప్పటికీ తన వంశంలో మాత్రం అమ్మాయి పుట్టక 138 ఏళ్లవుతుందని ఆండ్రూ చెప్పడంతో ఒక్కసారిగా షాకయ్యా. గర్భం దాల్చిన ప్రతిసారీ బేబీ జెండర్ విషయంలో 50-50 శాతం అవకాశాలుంటాయి.
కానీ ఇన్నేళ్లుగా ఆడపిల్ల పుట్టలేదంటే దేవుడు వీళ్ల ఓపికకు పరీక్ష పెట్టినట్లే అనిపించింది. బాబు పుట్టాక నాకు రెండుసార్లు అబార్షన్ కావడంతో ఆరోగ్యవంతమైన బిడ్డ పుడితే చాలనుకున్నా. కానీ ఆనందం రెట్టింపు చేస్తూ ఆడపిల్ల పుట్టింది..' అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది కరోలిన్.
బ్లూనా? పింకా?.. సర్‌ప్రైజ్!
పుట్టబోయే బిడ్డ ఆడా? మగా? తెలుసుకోవడం మన దేశంలో నిషిద్ధం. కానీ 'బేబీ జెండర్ రివీల్' పేరుతో విదేశాల్లో దీన్నో వేడుకలా జరుపుకొంటారు. దీన్నే 'బేబీ షవర్ (సీమంతం)'గానూ పిలుస్తారు. ఆండ్రూ-కరోలిన్ జంట కూడా గతేడాది సెప్టెంబర్‌లో తన కుటుంబంతో కలిసి ఈ వేడుకలు చేసుకుంది.
ముందుగానే తమకు పుట్టబోయేది అమ్మాయని తెలుసుకొని సంతోషంలో మునిగిపోయిన ఈ జంట.. తన కుటుంబ సభ్యుల్నీ సర్‌ప్రైజ్ చేయాలనుకుంది. ఈ క్రమంలోనే వాళ్లందరి కోసం పింక్/బ్లూ రంగుల క్రీమ్‌తో నింపిన కుకీస్‌ని ప్రత్యేకంగా తయారుచేయించింది.
వేడుక ఆరంభంలో ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన ఈ జంట.. ఆపై కుకీస్‌ని సర్వ్ చేసింది. 'ఎప్పటిలాగే ఈసారీ కుకీస్ మధ్యలో బ్లూ కలర్ క్రీమే ఉంటుంది..' అని నీరసంగా ప్యాకెట్ ఓపెన్ చేసిన ఆ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ఆనందంలో మునిగిపోయారు.
ఎందుకంటే ఈసారి కుకీస్ మధ్యలో బ్లూ కాకుండా పింక్ కలర్ క్రీమ్ ఉండడమే అందుకు కారణం! 'ఇలా మాకు పుట్టబోయేది ఆడపిల్లే అని తెలుసుకున్న మా కుటుంబ సభ్యులంతా.. ఆ క్షణం ఒక్కసారిగా ఎగిరి గంతేశారు..' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది కరోలిన్.
ఇలా తమ చిన్నారికి ముద్దుగా ఆడ్రీ అని పేరుపెట్టుకుందీ జంట. తన రాకతో తన కుటుంబం, వంశంలో సంతోషాన్ని మోసుకొచ్చిన ఈ పాప ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జూనియర్ సెలబ్రిటీగా మారిపోయింది.
0 Comments:
Post a Comment