UGC: ఇంగ్లిష్ మీడియం చదివినా స్థానిక భాషల్లో పరీక్షకు అనుమతించండి.. యూనివర్సిటీలకు ఆదేశం
ఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యత కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు విశ్వవిద్యాలయాలకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో కోర్సులను అభ్యసించినప్పటికీ.. వారు స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించినట్టు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. పాఠ్యపుస్తకాలను రూపొందించడంతో పాటు బోధన- అభ్యాసన ప్రక్రియ మాతృభాష/స్థానిక భాషలో జరిగేందుకు ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని యూజీసీ పేర్కొంది.
ఈ కృషిని బలోపేతం చేయడం, పాఠ్యపుస్తకాలను మాతృభాష/స్థానిక భాషల్లో తయారుచేయడం, ఇతర భాషలనుంచి ప్రామాణిక పుస్తకాలను అనువదించడంతో పాటు బోధన-అభ్యసన ప్రక్రియలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరమని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమాల్లో కోర్సులు అభ్యసించినప్పటికీ.. స్థానిక భాషల్లోనే సమాధానాలు రాసేలా అనుమతించాలని కోరింది.అలాగే, స్థానిక భాషల్లో పుస్తకాల అనువాదాన్ని పోత్సహించాలని, స్థానిక భాషల్లోనే బోధన- అభ్యాసన ప్రక్రియ ఉపయోగించాలని యూనివర్సిటీలను కోరుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
0 Comments:
Post a Comment